గుట్టుచప్పుడు కాకుండా
గుడ్డులోనుండి బయటికి
క్రొత్తగా వచ్చిన కోడిపిల్ల
కొంత కాలం
తల్లిరెక్కల క్రింద వెచ్చగా
సుఖంగా సురక్షితంగా పెరిగి
పెద్దకాగానే వెచ్చదనం నచ్చక
తల్లిని కాదని ప్రక్కకు తప్పుకున్న
మరుక్షణమే తన్నుకుపోయింది
గగనాన మాటేసిన ఓ రాక్షసిగ్రద్ద
ఆశతో ఆకలితో ఆకాశంలో
వేగంగా ఎగురుతూ పొరపాటున
కాళ్ళక్రింది కోడిపిల్లను
కారడవిలో జారవిడిచింది
"పాపం ఆ కోడిపిల్ల"
ఆ కారడవిలో ఆ కారుచీకటిలో
ముళ్ళపొదల్లో చిక్కుకుపోయింది
బిక్కు బిక్కుమంటూ దిక్కెవరా
అనుకుంటూ దిక్కులు చూస్తుంటే
కస్సుబుస్సుమంటూ కాటువేసేందుకు
మెల్లగా కదులుతోంది పొదలమాటున
కోరలు చాస్తూ కోడెనాగొకటి
"పాపం ఆ కోడిపిల్ల"
పెనంనుండి పొయ్యిలో పడినట్టైంది
ముందు నుయ్యి... వెనుక గొయ్యి
ఎగిరే ఆ గ్రద్ద కాలి గోళ్ళనుండి తప్పించుకున్నా
బుసకొట్టే కోడెనాగు విషపుకోరలకు చిక్కినందుకు
విలపిస్తూ...విలవిలలాడుతూ...అడవిలో
"పాపం ఆ కోడిపిల్ల" వెయ్యిదేవుళ్ళకు మొక్కుకుంది
అంతే ప్రాణదాతలా వేటగాడు ప్రత్యక్షమయ్యాడు
గురిచూసి ఒక్క బాణం విసిరాడు
కోడెనాగును హతమార్చి...కోడిపిల్ల నెత్తుకుపోయాడు
అవునిది నిజం అమ్మానాన్నల కళ్ళుగప్పి
గడపదాటిన "ఆడపిల్ల బ్రతుకు"
అడవిలో చిక్కిన "కోడిపిల్ల బ్రతుకు" రెండూ ఒక్కటే
అడుగడుగునా గండాలే...సుఖదుఃఖాల సుడిగుండాలే
అమ్మాయిలూ జాగ్రత్త!తల్లి దండ్రులూ ! తస్మాత్ జాగ్రత్త !



