Facebook Twitter
అర్థరాత్రి స్వాతంత్ర్యం

అదిగో అదిగో అల్లదిగో
ఆనీలినీలి ఆశలఆకాశంలో
రెపరెపలాడుతోంది నా ముత్యాల మురిపాల
మువ్వన్నెల జెండా !‌ నా ముచ్చటైన జెండా !

ఏమన్నది ? ఏమన్నది ? నా మువ్వన్నెల జెండా !
ఎందరో నిస్వార్థపరుల, మహానుభావుల మహాత్ముల
స్వాతంత్ర్యసమరయోధుల జాతినేతల, జైలుజీవితాల
రక్తతర్పణాల ప్రతిఫలమే ఈఅర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది

ఏమన్నది ? ఏమన్నది ? నా అర్థరాత్రి స్వాతంత్ర్యం
సర్వమతాలకు, కులాలకు, జాతులకు సంస్కృతికి,
సకల సంప్రదాయాలకు నా భారతావని నిలయమన్నది
అంతులేని ఆథ్యాత్మిక సంపదకు అది ఓఆలయమన్నది

ఏమన్నది ? ఏమన్నది ? నా అర్థరాత్రి స్వాతంత్ర్యం
సమగ్రతకు సమైక్యతకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు
సమానత్వానికి సౌభ్రాతృత్వానికి ప్డసోపానమన్నది
అంబేద్కర్ రాజ్యాంగమే మనకు రక్షణ కవచమన్నది
ప్రజాస్వామ్యమే మన ప్రభుత్వానికి ఆరవప్రాణమన్నది
అదే మన భరతమాతకు స్వర్ణాభరణమన్నది

ఏమన్నది? ఏమన్నది ? నా అర్థరాత్రి స్వాతంత్ర్యం
భిన్నత్వంలో ఏకత్వమే మన నిత్యనినాదమన్నది
నీతిగా... నిజాయితీగా... నిప్పులా...నిస్వార్థంగా‌
నిర్భయంగా బ్రతకమన్నది చిరునవ్వులు చిందిస్తూ
స్వేచ్ఛగా సింహంలా సగర్వంగా తలఎత్తుకుతిరగమన్నది