Facebook Twitter
మూడు కేకలు... మూడు లేఖలు

పోస్ట్.....
మొదటి కేక...మొదటిలేఖ
మిలిటరిలోవున్న భర్త నుండి
భార్యకు...."అందిన ప్రేమలేఖ"....

అదిచూడగానే ఆమె ముఖమంతా
ఏడు రంగుల ఇంద్రధనుస్సయింది
హృదయం ఆనందంతో ఉప్పొంగింది
ఒళ్ళంతా త్రుళ్ళింతా మనసంతా పులకింత
భర్త.... దూరాన...ఎక్కడో మంచుకొండల్లో
గుర్తుకురాని రోజంటూ లేదు

ఎన్నో రోజులు కళ్ళు కాయలు కాసేలా
ఎదురుచూసింది, నిదురకాసింది
కలిసి కాపురం చేసిన కొద్ది రోజుల్ని
ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసే
ఆ ఉత్తరం, భర్తనుండి రాగానే, చదవగానే
ఆమె కళ్ళల్లో  నీళ్ళు గిర్రున తిరిగాయి
అవి కన్నీళ్ళు కావు...."ఆనందబాష్పాలు"

పోస్ట్... పోస్ట్...
రెండవ కేక... రెండవ లేఖ
మిలిటరిలోవున్న కొడుకు నుండి
తల్లిదండ్రులకు "అందిన మనియార్డర్"....

ఆ డబ్బు అందగానే వారి ఆనందం
వర్ణణాతీతం అది అనుభవైకవేద్యం
తాము కష్టపడి చదివించినందుకు
తాము కన్న కలలు సాకారమైనందుకు
తమ బిడ్డ గొప్ప ప్రయోజకుడైనందుకు
ఒక మంచి ఉద్యోగం చేస్తున్నందుకు
తమను మరిచిపోకుండా నెలనెలా
మనియార్డర్ ను పంపుతున్నందుకు, మంచి
బిడ్డనే "కన్నారని" పదిమంది "అన్నారని"
ఆ తల్లిదండ్రుల కళ్ళళ్ళో నీళ్ళు గిర్రున తిరిగాయి
అవి కన్నీళ్ళు కావు...."ఆనందబాష్పాలు"

పోస్ట్... పోస్ట్... పోస్ట్...
మూడవ కేక... మూడవ లేఖ
మిలిటరి నుండి "అందిన టెలిగ్రామ్"...
కుటుంబానికి అది ఒక "విషాదకర వార్త"

అది అందుకునే ముందు
భార్య చేతులు భయంతో వణికాయి,అది
మంచుకొండలనుడి వచ్చిన "మరణవార్త"
తమ ఇంటి దీపమైన ఒక్కగానొక్క కొడుకు
దేశసరిహద్దుల్లో శత్రువులతో పోరాడి పోరాడి
వీరమరణం పొందాడన్న "విషాదకర వార్త"
కడుపుతో వున్న భార్య కాలి క్రింద భూమి కదిలింది
ముసలి తల్లిదండ్రుల గుండెలు ముక్కలైపోయాయి
ఊరు ఊరంతా ఉలిక్కి పడింది
ఇళ్ళంతా శోకసంద్రమైంది,అందరి కళ్ళళ్ళో కన్నీరే"

ఏ చేతితో నైతే... "ప్రేమలేఖ" ను అందించానో
ఏ చేతితో నైతే..."మనియార్డర్ "ను అందించానో
అదే చేతితో..."మరణవార్త" నందించానంటూ
వెక్కి వెక్కి ఏడ్చిన...."ఆ ఊరి పోస్టమాన్" కళ్ళల్లో
నీళ్ళు గిర్రున తిరిగాయి ...అవి ఆనందబాష్పాలు కాదు
ఉప్పొంగిన పాతాళగంగ ఆవీరజవాన్ పాదాలు కడగంగ