ఏది దైవ నిర్ణయం ? ఏది ప్రకృతి ధర్మం ?
ఎందరికో ఆధారమైన
ఓ ఇంటి యజమానిపై
విధి విషపునవ్వు నవ్వితే
అతనిపై ఆధారపడిన
అందరి కళ్ళల్లో పొంగేది కన్నీరే
అతనిపై ఆధారపడిన
అందరి ముందరి
జీవితాలు చిందరవందరే
ఎగిరే గాలిపటం
ఎందాక ఎగురుతుంది ?
చేతిలో దారం ఉన్నంతవరకే
వెలిగే దీపం
ఎందాక వెలుగుతుంది ?
దివ్వెలో నూనె ఉన్నంత వరకే
చీకటివెలుగుల సుఖదుఃఖాల
సుడిగుండంలాంటి ఈ జీవనయాత్ర
ఎంతవరకు కొనసాగుతుంది ?
బొందిలో ప్రాణమున్నంత వరకే
ఈ భూమిపై పుట్టిన ప్రతిజీవి
గిట్టవలసిందే కట్టై కాలవలసిందే
తిరిగి మళ్లీ మట్టై పోవలసిందే
ఇది దైవనిర్ణయమే ఇది ప్రకృతిధర్మమే
ఔను ఇది అంతుచిక్కని సృష్టి రహస్యమే



