నరుడే...నారాయణుడు..!n
ఎరుపెక్కిన "సూర్యుడు"
ఎవరెస్ట్ శిఖరం...
"ఎక్కుతున్నాడు"...ఎందుకు..?
కొండగుహలే గృహాలుగా
బ్రతికే అడవిబిడ్డల బ్రతుకుల్లో
అంధకారాన్ని తొలగించేందుకు...
చల్లని తెల్లని...
"చందమామ" నల్లని మబ్బుల్లో
"నక్కుతున్నాడు"...ఎందుకు..?
చీకటిలో...చిలిపి చేష్టలతో
కొంటెకోరికలతో తరగనితాపంతో
రగిలిపోయే భగ్న ప్రేమికులు
రతిరాగాలు ఆలపించేందుకు...
శిథిలమైన
శిలలను శిల్పి ఉలితో
సుందర దేవతాశిల్పాలుగా
"చెక్కుతున్నాడు"...ఎందుకు..?
తన ఆలుబిడ్డల ఆకలి తీరేందుకు...
గర్భగుడిలోని దైవానికి...
అర్చనలు అభిషేకాలు జరిగేందుకు...
భక్తాగ్రేసరుడొకడు
కనిపించే ప్రతిమనిషికి
"మ్రొక్కుతున్నాడు"...ఎందుకు..?
నరుడే నారాయణుడన్న
నగ్నసత్యం తెలిసినందుకు...
తనకు ముందు జన్మలోనైనా
ముక్తిని ప్రసాదించేందుకు...



