ఉగాది అంటే... తెలుగులోగిళ్ళకు తొలి పర్వదినమే
నక్రత్ర కాలగమనమే వసంత ఋతువు ఆగమనమే
మన తెలుగుభాషకు కమ్మని కవితలతో కనకాభిషేకమే
మన తెలుగుతల్లికి పసందైన పద్యాలతో పట్టాభిషేకమే
ఉగాది అంటే...శుభకార్యాలకు ఒక శుభ ముహూర్తమే
ఉగాది అంటే...ఊరించే షడ్రుచుల పచ్చడే...కోయిలల
రాగాలే...మామిడాకులే...మంగళతోరణాలే... ఇళ్ళంతా సందడే...చిరునవ్వుల చిందులే...పసందైన విందులే
మదినిండా ఉల్లాసమే...ఉత్సాహమే...ఊరంతా ఉత్సవమే
ఉగాది అంటే...ప్రకృతిలో ఓ చైతన్యమే ఓ పచ్చదనమే
ఉగాది అంటే...పంచాంగం శ్రవణమే...
అందరి ముందరిజీవితం సుందర నందనవనమో
చిందరవందరో గందరగోళమో గాఢాంధకారమో
అర్థంకాదు ఐనా బంగారు భవిష్యత్తుపై భారీఅంచనాలే
ఉగాది అంటే...కోటి కొత్త ఆశలకు
రెక్కలు తొడిగే పండితుల ప్రవచనాలే
ఉగాది అంటే...కవిసమ్మేళనాలే...కవుల కలాల పండుగే సాహితీసందడే కవులకలయికే ప్రేమపూర్వక పలకరింపులే
కవుల కమ్మని కవితాగానమే పండితుల ప్రసంగాలే
సన్మానాలే...సత్కారాలే... అంబరాన్నంటే సంబరాలే
ఉగాది అంటే...మరిచిపోలేని మరపురాని మధురజ్ఞాపకాలే
ఉగాది అంటే...ఒక ఆశాకిరణమే
ఆశలపందిరిని అల్లుకోవడమే...కమ్మనికలలు కనడమే
భవిష్యత్తు ఒక అక్షయపాత్రన్న కొండంత ఆశతో
ఆత్మస్థైర్యంతో సవాళ్ళను ఎదుర్కోవడమే
సమస్యలతో సతమతమైపోక సమరం సాగించడమే
ముందున్నది ముళ్ళబాటకాదు...మరుమల్లెల తోటని
ఆశేశ్వాసగా ముందుకు సాగిపోవడమే
ఉగాది అంటే...ఒక ఉషోదయమే...



