Facebook Twitter
ఎవరు గొప్ప ? ఎవరికెరుక ఆ పరమాత్మకు తప్ప..

మర్రిచెట్టు ఎంత పెద్దదైన

ఎందరికో చల్లని నీడనిచ్చినా

పెరటిలో చెట్టుగా దాన్ని పెంచుకోరు

పూజలు చేయరు కానీ

తులసి మొక్క చిన్నదైనా

పెరటిలో పెంచుకుంటారు

రోజు పూజలు చేస్తారు

దేని విశిష్టత దానిదే... దేనిశక్తి దానిదే

 

మధుర గాయకుడు ఘంటసాల

నటసామ్రాట్ ఎన్టీఆర్ లా

నటించలేడనడం

గానగంధర్వుడు మధురగాయకుడు

బాలసుబ్రమణ్యం చిరంజీవిలా

చిందులు వేయలేడనడం వెర్రితనం

ఎవరి జన్మ వారిదే... ఎవరి జాతకం వారిదే

 

వేమన, పోతనలా పద్యాలు

వ్రాయలేడనడం‌ అవివేకం అజ్ఞానం

ఎవరి పాండిత్యం వారిదే...ఎవరి విజ్ఞానం వారిదే

 

ఏనుగునెక్కించి ఊరేగిస్తే

ఎవరైనాఎగిరి గంతేస్తారు

గాడిద నెక్కించి ఊరేగిస్తే

గర్వపడేదెవరు ? 

దేని విలువ దానిదే...దేని గొప్పదనం దానిదే

 

సహనం, సమానత్వం

మంచితనం, మానవత్వం

దాతృత్వం, దైవత్వం వంటి

సద్గుణాలున్న వారే సంఘసంస్కర్తలు

సమాజానికి ఆరక వెలుగునిచ్చే మణిదీపాలు

 

పుణ్యమైన, పురుషార్థమైనా

ఎవరికి దక్కవలసింది వారికే దక్కుతుంది

ఎవరికి చిక్కవలసింది వారికే చిక్కుతుంది

ఇదే ప్రతి మనిషి జీవిత పరమార్థం...

అంతకుమించి వెతుకులాట వ్యర్థం...