Facebook Twitter
టక్కరి టమోటా

వరదొస్తే గోదారి
నీటిమట్టం పెరుగుతుంది
ఆపై క్రమేపీ తరుగుతుంది

ఆకాశంలో అందమైన నెలవంక
అమావాస్యనాడు తరుగుతుంది
పున్నమి నాడు పెరుగుతుంది

తారాజువ్వలా...
రివ్వుమని రాకెట్ లా...
నింగి కెగిరిన టమోటా ధరలు
అక్కడే చక్కర్లు కొడుతున్నాయి

నిన్న నిగనిగలాడుతూ
ముద్దొచ్చిన టమోటా
నేడు "నిప్పుకణికలా"
ఎర్రగా మారిపోయింది
భగభగమని మండిపోతోంది

పంటకు మార్కెట్లో 
గిట్టుబాటు ధరలేక
రైతులు కొందరు
గిలగిల లాడుతుంటే...

కొనలేక తినలేక
మధ్యతరగతి ప్రజలు
విలవిల లాడుతుంటే...

వంటగదిలో వనితలు
కంటతడి పెడుతుంటే...

నేడు టమోటా పంటను
నమ్మిన అమ్మిన రైతులు
కొందరు రాత్రికిరాత్రే
లక్షాధికారులౌతున్నారు...
కొందరు కోటీశ్వరులౌతున్నారు...
ఔరా ఇదేమి చోద్యమో ఇదేమి వింతో
ఎంతకూ ఈ మనిషికీ అర్థం కాకున్నది...