రక్షించే వృక్షాలే రాక్షసులైతే...
పక్షుల ప్రాణాలకు రక్షణ ఏది?
చెట్టు గుండెల్లో గుట్టుగా గూడు
కట్టుకొన్న పక్షుల రెక్కలు విరిచి
గుండెల్లో గునపాలు గుచ్చేదెవరు ?
గూటిలో పెట్టిన గుడ్లను
మాయం చేసేదెవరు ?
పెట్టిన గుడ్లు పుట్టిన పిల్లలు
బుసలు కొట్టే సర్పాలకు సదా సమర్పయామియే...కదా
"పక్షులు పస్తులుండవు"
"పక్షులకు ఆస్తులుండవు"
ఆకలి మంటలు రగిలితే
రెక్కలు రెపరెపలాడించక తప్పదు
ఆకాశంలో అన్వేషించక తప్పదు
ఆకాశంలో ఎంత ఎత్తుకు
ఎగిరినా "ఆకలి" తీరదు...
మేఘాలలో దాగిన నీరు
త్రాగి "దాహం" తీర్చుకోలేవు...
అందుకే నేలకు దిగిరాక తప్పదు
"నడకరాని ప్రతిపక్షి ఎగరక తప్పదు"
ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ
చేసే "ప్రతిప్రయాణం" ఒక ప్రమాదమే...
ఉరుములు ఉరిమి మెరుపులు మెరిసి
కురిసే...కుంభవర్షంలో... విసిరే
హోరు గాలిలో ...చిక్కుకున్న
ఆ పక్షులకు పాపం దిక్కెవరు ?
"పక్షులు కోరేది కూడు గూడు"
గూడు చెదిరి గుండె పగిలితే...
ఆకలి రగిలి కడుపు మండితే...
పక్షులన్నీ ఏం చేస్తాయి ?ఏకమై
ముక్కులతో పొడిచి చంపుతాయ్...
"ముక్తిని విముక్తిని" పొందుతాయ్ ...
తమ "శక్తిని" నిరూపించుకుంటాయ్...
ఈ పక్షులకు ఆ సర్పాలకు ఆ వృక్షాలకు
మధ్య సయోధ్య కుదిరేది ఎప్పుడో..?
నా సందేహం తీర్చేది ఎవరో ? ఏమో ?
రాజ్యాధికారం దక్కేదెప్పుడో...?
రాక్షసపాలన అంతమయ్యేదెప్పుడో..?
ఆ పక్షులు ప్రశాంతంగా బ్రతుకేదెప్పుడో



