Facebook Twitter
గొర్రెపిల్లల గొప్పతనం ???

కత్తినూరె కసాయివాడి
మాటలు నమ్మి వాడి వెంట తిరిగే
ఈ గొర్రెపిల్లలకు బుర్రలేదు
ఈ మేకపిల్లలకు బుద్దిలేదు అని అనగానే
ఆ మూగజీవులు ఒక్కసారిగా పక్కున నవ్వి
మీ అంతతాత్మను అడగితే మీకే తెలుస్తుంది
చేసిన మేలును మరిచేవాడు
మనిషేకాదని మా జాతివాడని

ఔను
మమ్మల్ని డబ్బుపెట్టి కొన్నవాడు కసాయివాడే 
కొనకపోతే మేము పొలంలో మా యజమాని
దగ్గరే ఉండేవాళ్ళం, ఉంటే ఏమయ్యోది?
ఎదో ఒక కాళరాత్రి ఏదో ఒక తోడేలు వచ్చి
మా పీకలు పట్టుకొని
అడవిలోకి ఈడ్చుకుపోయేది
మమ్మల్ని చీల్చుకు తినేది
తన ఆకలిని తీర్చుకునేది

కానీ
మమ్మల్ని ఖరీదుపెట్టి
కొన్నవాడు కసాయివాడైనా
మా ప్రాణాలు కాపాడినవాడు
మాకు నీడనిచ్చినవాడు, చలికి
మాకు గూడు నిచ్చినవాడు

ఆకలైతే ఆకులు విసిరి
మా ఆకలి తీర్చినవాడు
మా కన్నతండ్రితో సమానం
ఆయన పుణ్యమే,
మేము కొన్ని రాత్రులైనా
ప్రశాంతంగా నిద్ర పాయాం

అందుకే
ఆయన చేతిలో ఉన్న
ఆ పదునైన కత్తిని చూస్తే
మాకు భయం లేదు పరమానందమే
ఎప్పుడైనా ఆ కత్తికి బలికావడానికి మేము సిద్ధమే

కారణం
మేము కన్నుమూస్తేనే ఆయనకి కాసులొచ్చేది
ఆ కాసులొస్తేనే అందరి కడుపులు నిండేది
కడుపులు నిండితేనేగా
కుటుంబం కులాసాగా వుండేది" అన్నాయి

ఆహా ఏమీ ఈ గొర్రెపిల్లల గొప్పతనం
ఆహా ఏమీ ఈ మేకపిల్లల త్యాగగుణం
ఉపకారం చేసిన వారికే
అపకారం తలపెట్టే ఓ మనిషీ
ఇకనైనా ఈ మూగజీవాలను చూసైనా
నేర్చుకో నిద్రమాని నిజం తెలుసుకో
నీ జీవితాన్ని మార్చుకో