నా జీవిత
నిర్మాతలు...ముగ్గురు
కబీర్ దాస్ ...
భగవాన్ బుద్ధ...
మహాత్మ జ్యోతిరావుపూలే...
నా ఆరాధ్య
దేవతలు...ముగ్గురు
విద్య...
స్వాభిమానం...
ఆత్మ గౌరవం...
నా సుగుణాలు...నాలుగు
సత్ప్రవర్తన...శుభ్రత
సశ్శీలం....సదాచారం
మూఢనమ్మకాల్ని
మూలకు నెట్టండి...
అదృష్టం...
కర్మసిద్ధాంతాలను
ప్రక్కన పెట్టండి...
తిరుగులేని ఒక
సంఘటిత శక్తిగా మారండి...
తిరుగుబాటు చేయండి.
తినడానికి తిండి
తీర్థయాత్రలతో రాదు
పూజలు...పునస్కారాలు...
గంగలో స్నానాలు చేస్తే పుట్టదు
రాజ్యాధికారం
సంపాదించుకోండి...
రాజులు కాకపోతే నేమి?
రాజ్యాలు ఏలకపోతేనేమి
కనీసం బానిసత్వం నుండైనా
మీకు విముక్తి లభిస్తుంది
ఒక వ్యక్తి కంటే జాతి
ఒక జాతికంటే సంఘం...
ఒక సంఘం కంటే ఒక దేశం
ఒక దేశం కంటే...
ఆత్మగౌరవం గొప్పది...
కులం
కులమని అరవకండి...
కులం పునాదుల మీద
ఒక జాతిని గాని
ఒక నీతిని గానీ నిర్మించలేరు...
ఎవరైనా నిరంతరం ఆలోచన...
సాహసంతో కూడిన సాధన...
కృషి కసి పట్టుదల ద్వారానే
ఉన్నతశిఖరాలను చేరుకుంటారు.
నిన్న మీరు
బావిలో నీళ్లు తాగటానికి...
చక్కగా చదువుకోవడానికి...
ఆలయంలో ప్రవేశించడానికి...
వీధిలో స్వేచ్ఛగా తిరగడానికి...
కొత్త దుస్తులు వేసుకోవడానికి...
అన్యాయాన్ని ప్రతిఘటించే
అధికారం లేకుండా చేశారు.
అందుకే నా బహుజనులారా!
శాసనాధికారం చేపట్టండి...
సంఘం విధించిన ఆంక్షలను
ప్రతిఒక్కరు ప్రతిఘటించండి...
ప్రగతి పథంలో పయనించండి...
విద్యావంతులు కండి...
విద్యతో మీ ఆర్థిక బాధలు
తొలగిపోతాయి...
మీ ఆకలి తీరుతుంది...
మీరు ఆరోగ్యంగా ఉంటారు...
మంచిచెడు విచక్షణ కలిగిఉంటారు.
న్యాయ అన్యాయాల
గురించి ఆలోచిస్తారు...
గౌరవంగా బ్రతుకుతారు...
సంఘములో బలమైన
ఒక శక్తిగా...మారిపోతారు.
ప్రబోధించు...
సంఘటిత పరచు...
ప్రతిఘటించు...పోరాడు...
ఈ నాలుగుసూత్రాలు పాటించండి.
ఉపశమనం వల్ల ఉపయోగం లేదు
కులరుగ్మత పూర్తిగా నయం కావాలి.



