500 కిలోమీటర్లు,
పగలు,నిప్పులు కురిసే ఎర్రని ఎండలో,
రాత్రి,కారుచీకట్లలో,కరోనా కాలంలో
కాలినడకన, ప్రాణాలకు తెగించి
8 మంది వలస కూలీల ప్రయాణం...
మార్గమధ్యంలో... అడుగడుగునా
గండాలే ,సుడిగుండాలే, కన్నీటి గాథలే
పిల్లలిద్దరూ వడదెబ్బతో చనిపోయే
దారిలో చెల్లి ఆకలితో చనిపోయే
నిండుగర్భిణి భార్య పురిటి నొప్పులతో చనిపోయే
పాము కుట్టి తమ్ముడు చనిపోయే
అన్నా వదినా రైలు ప్రమాదంలో చనిపోయే
జీవచ్ఛవంలా ఇళ్ళు చేరిన ఆ వలస కూలికి
తల్లిదండ్రుల కడచూపైనా దక్కలేదు,కారణం
కరోనాతో అమ్మానాన్నలు చనిపోయే
ఆవేదన చెందిన ఆ వలసకూలిని ఊరిలోకి రానివ్వరాయే
ఆవూరిలో చెట్టుకు వురేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు
ఇంతటి దారుణానికి ఇందరి మరణాలకు బాధ్యులెవరు?
కంటికి కనిపించని కరోనానా, కరుణ జాలిలేని ప్రభుత్వాలా?
కరోనా వచ్చింది ఒక కుటుంబం మొత్తాన్ని కూల్చివేసింది
కరోనా వచ్చింది మనిషి మనుగడనే పూర్తిగా మార్చివేసింది
మారవలసింది ఇక కళ్ళున్నా చూడలేనిచెవులున్నా వినలేని
చేతులున్నా సహాయం చెయ్యలేని హృదయమున్నా ఆదుకోలేని అధికారులే, అధికారం లోనున్న ప్రభుత్వమే



