కరోనా కడుపులో
విషముంది
కరోనా కళ్ళల్లో
మృత్యువుంది,
ప్రపంచ కుబేరుడైనా
ఎంతటి మేధావియైనా
ఎంతటి శక్తిమంతుడైనా
ఎంతటి శ్రీమంతుడైనా
ఎన్ని సామ్రాజ్యాలను ఆక్రమించినా
ఎన్ని దేశాలను జయించినా
ప్రభులకు ప్రభువైనా
రాజులకు రాజైనా
ఎన్ని శాసనాలు చేసినా
బంధువులున్నా బలగమున్నా
మందీమార్భలమున్నా,
నింగికెగిరే గాలిని
నిముషమైనా నిలబెట్టలేడు
కోట్లడబ్బును పోసి కొనలేడు,
కళ్ళుమూసుకుని కరోనా మృత్యువు
ముందు మోకరిల్లవలసిందే
మాయదారి కరోనా వచ్చి
మనిషిలో పెనుమార్పులు తెచ్చింది
మనిషి ఆలోచనలు మారిపోయాయి
బంధాలు బాంధవ్యాల మీద
భ్రమలు తొలగిపోయాయి
ఆస్తిపాస్తులమీద ఆశలు సన్నగిల్లాయి
కాలమెంత విలువైనదో
ప్రాణమెంతో ఖరీదైనదో అర్థమైంది
ఈ భూమి మీద ప్రతిజీవి
కళ్ళు తెరవడం, బ్రతకడం,
వినడం, కనడం, తినడం
ఆలోచించడం, ఆర్జించడం
అనుభవించడం,అస్తమించడం
సర్వం ఆ సృష్టికర్త చేతుల్లోనే...
నిజానికి మనిషి నిమిత్తమాత్రుడే



