అయ్యే దైవమా? ఏమీ దుస్థితి
ఎన్నడూ వినలేదే కలనైనా కనలేదే
ఈ కరోనా వచ్చింది కష్టాలెన్నో తెచ్చింది
ఎవరైనా ఆప్తులు అస్తమిస్తే,
దూరంగా వుండి దుఃఖించడం తప్ప,
పాదాలు,ముట్టుకోలేని
ప్రేమతో, ముద్దు పెట్టుకోలేని
చిట్టచివరిగా గట్టిగా వాటేసుకొని
రొమ్ములు బాదుకొని రోదించలేని
గుండెలు పగిలేలా తనివితీరా
మనసారా వెక్కివెక్కి ఏడవలేని
ఒకరిని ఒకరు ఓదార్చుకోలేని
ఒకరికొకరు దైర్యం చెప్పుకోలేని
కలిసి ముఖాముఖిగా మాట్లాడుకోలేని
కలిసి కన్నీరు కార్చలేని
కారేకన్నీటిని తుడుచుకోలేని
ఆఖరిచూపుకైనా నోచుకోలేని
శాస్త్ర బద్దంగా శవాన్ని సాగనంపలేని
ఆత్మతృప్తిగా అంత్యక్రియలు నిర్వహించలేని
ఈ కాలం ఏమికాలం ? ఏమి కాలం ?
కలికాలం, కాదు ఇది కరోనా కాలంరా తమ్ముడూ
అన్నీ కన్నీళ్ళు కష్టాలే తప్ప సుఖశాంతులేలేని
ఈ జన్మ ఏమి జన్మ ? ఏమి జన్మరా తమ్ముడూ?
ఆర్జించిన కోట్లు తృప్తిగా అనుభవించలేని
ఈ బ్రతుకు ఏమి బ్రతుకు ? ఏమి బ్రతుకురా తమ్ముడూ?
ఇష్టమైనదేదీ ముట్టుకోలేని, పోతూపట్టుకుపోలేని
ఈ జీవితం ఏమి జీవితం ? ఏమి జీవితంరా తమ్ముడూ?
ఇది కలికాలంరా తమ్ముడూ
కాదు కాదు ఇది కరోనా కాలంరా తమ్ముడూ....



