మానవత్వమే కొరత
షాపుల్లో మందుల కొరత
ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత
ఆక్సిజన్ సిలిండర్ల కొరత
ఐసీయూలో వెంటిలేటర్స్ కొరత
శవాలను తరలించ అంబులెన్సుల కొరత
శ్మశానంలో శవాలను కాల్చేందుకు
కట్టెలకు కొరత పూడ్చేందుకు స్థలాలకొరత
శ్మశానాల్లో క్యూలో అంబులెన్సులా?
అయ్యో ఓ దైవమా ఏమిటీ కొరతలకొరడా
నిజానికి ఈ కొరత యదార్థం కాదుకాదు
ఇది ఒక విషప్రయోగం...ధనార్జనకు దారి
ఇది మూటికి ముమ్మాటికీ కృత్రిమకొరతే
చీకట్లో సిగ్గూఎగ్గూలేని చిల్లర వ్యాపారమే
డిమాండ్ ఎక్కువైతే సప్లై తక్కువన్నది
గొప్ప ఆర్థికసూత్రమే జగమెరిగిన సత్యమే
తరిచిచూడ ఇది మందుల కొరతకాదు
మనిషిలో మానవత్వమే...కొరత
దాతృత్వమే దైవత్వమని
మంచితనమే మానవత్వమని
మనసున్న ప్రతిమనిషి గ్రహించాలి
అసలెందుకింతటి ధనదాహం?
ఆపదలో ఉన్న అత్యవసరంలో ఉన్న
ఇరుగు పొరుగువారిని ఆదుకోవాలి
నిప్పుల్లో కాలిపోతున్నవారిని రక్షించాలి
నీ కళ్మముందే నీళ్ళలో పడి మునిగిపోతున్న
వారిని గాజఈతగాళ్లను రప్పించి గట్టుకు చేర్చాలి
కరోనా నేర్పిన ఈగుణపాఠం నిత్యం గుర్తుపెట్టుకోవాలి
ఏదీ నీది కాదని...
ఏది శాశ్వతం కాదని...
ఎవరూ నీ వెంటరారని...
ఊపిరన్నది ఒక నీటిబుడగని...
రేపన్నది ఒక మాయేనని నేడే నిజమని...
ఏక్షణమైనా కోట్లు ఆర్జించిన కోటీశ్వరులైనా ...
కన్నుమూయడం ఖాయమని కాటికెళ్ళడం తథ్యమని.



