Facebook Twitter
కళా పోషకులు..?

నాడు చిరు
కుటుంబాలను
పోషించుకోలేక
కడు పేదరికంలో
మగ్గిపోతున్న కవులకు
ఆత్మీయ ఆహ్వానం పలికి
ఆప్యాయంగా అక్కున చేర్చుకుని
ఆస్థానకవులుగా గొప్ప గుర్తింపునిచ్చి

రాజులు పోయినా
రాజ్యాలు పోయినా
శిలాశాసనాల్లా తరతరాలకైనా
చెక్కుచెదరని ఖండకావ్యాలను
ప్రబంధాలను బృహత్ గ్రంథాలను
వారిచే వ్రాయించి...

రాజమందిరాలలో
రాజభోగాలననుభవించే
అదృష్టాన్ని కల్పించి
అందమైన బిరుదులిచ్చి
అగ్రహారాలిచ్చి

సభలు
సమావేశాలేర్పాటు చేసి
సన్మానాలు సత్కారాలు చేసి
బంగారు వెండినాణేలను
బహుమతిగా ఇచ్చి
గండపెండేరాలు కీర్తి కిరీటాలుతొడిగి
గజరాజులపై ఘనంగా ఉరేగించిన

ఆ కళాపోషకులకు
ఆ ధర్మప్రభువులకు
ఆ సాహితీ పిపాసులకు
ఆ ఉదారహృదయులకు

కవి పండితులు తమ
కలాలకు పదును పెట్టి
రాజులను రక్షకులుగా
ఆపద్భాంధవులుగా
నిజదైవాలుగా కీర్తించి

వారి ఉన్నతాశయాలను
ఉత్కృష్టమైన సుచరిత్రలను
అనుభవించిన రాజవైభోగాలను
చేసిన పుణ్యకార్యాలను
చూపిన పౌరుషాన్ని
ప్రదర్శించిన వీరత్వాన్ని
సాధించిన ఘనవిజయాలను

అద్భుతంగా లిఖించి
తాళపత్ర గ్రంథాలుగా భద్రపరచి
రాజుల ఋణాన్ని తీర్చుకున్నారు
వెయ్యితరాలకైన వారి నామధేయం
విశ్వమంతా మారుమ్రోగేలా గుర్తుండిపోయేలా
ఆ పుణ్యమూర్తులకు
పునర్జన్మను ప్రసాదించారు