Facebook Twitter
హర్షం హర్షం కవితల వర్షం

కురిసింది
నేడు కవితల కుంభవర్షం...
ఎదనిండా
ఏదో తెలియని హర్షం హర్షం...

ఈ వేళలో....
నా‌ మనసంతా
పరవశించిపోయే వేళలో...
నా "కవిమనసు" మర్కటమై
ఏడుకొండలు ఎక్కింది
కోనేటి రాయుడికి మొక్కింది
పొర్లుదండాలు పెట్టింది
కోటి కొబ్బరి కాయలు కొట్టింది

ఈ వేళలో....
నా‌ తనువంతా
పులకించిపోయేవేళలో
నా "కవిమనసు"
పున్నమి వెన్నెల్లో
పురుడు పోసుకున్నది
మత్తెక్కి మయూరంలా
పురివిప్పి నాట్యం చేసింది
పులకరించి పోయింది

ఈ వేళలో...
నా హృదయం
ఉప్పొంగిపోయే వేళలో...
నా "కవిమనసు"...
కొమ్మల్లో కోయిలమ్మలా
కమ్మ కమ్మగా కూసింది...
కళ్ళకు...
కాంతి తోరణాలు కట్టింది...
పెదవులపై...
చిరునవ్వుల పాన్పు వేసింది...

ఎదలో...
ఏదో పట్టరాని పరమానందం
ఏడు రంగుల
ఇంద్రధనుస్సై విరిసింది...
నా అంత రంగాన...
సంతోషపు చిరుజల్లు కురిసింది...
అందుకే ఎదనిండా
ఏదో తెలియని హర్షం హర్షం...
కారణం... ఒక్కటే...
కురిసింది నేడు కవితల కుంభవర్షం...