ఒకటి మాత్రం
పచ్చినిజం
ఎన్నో రాజ్యాలపై
దండయాత్రలు చేసి
ఎందరినో సంహరించి
ఎంతో రక్తపాతం సృష్టించి
ఎన్నో రాజ్యాలను జయించి...
మేమే ఎదురులేని రాజులం
కనుచూపు మేరలో విస్తరించిన
ఈ అఖండ సామ్రాజ్యానికి
మేమే రాజులం మహరాజులం
చక్రం తిప్పే చక్రవర్తులం అంటూ
విర్రవీగుతూ మీసాలు
మెలిపెడుతూ రాజభోగాలు
అనుభవించిన రాజులు
రాజసింహాసనాలు నేడు
కాలగర్భంలో కలిసిపోయినా...
నాటి మన ప్రాచీన కవులు...
అపారమైన పాండిత్య ప్రతిభతో
అద్వితీయమైన మేధస్సుతో...
రాత్రింబవళ్ళు
రక్తాన్ని స్వేదంగా చిందించి...
అక్షర సేద్యం చేసి అందించిన
ఖండకావ్యాల్లో ఆ రాజులింకా
అక్షరాల పాలరాతి సమాధుల్లో
సజీవంగా నేటికీ బ్రతికే ఉన్నారు
అందుకే కవులనాదరించిన
సాహిత్యాన్ని ప్రోత్సాహించిన
వారు కలకాలం బ్రతికి ఉంటారు...
కళ్ళకు కనిపించకున్నా చరిత్రపుటల్లో
అక్షరాల్లో అదృశ్యంగా దాగి ఉంటారు



