Facebook Twitter
ఓ మల్లయోధుల వారసుడా..!మళ్ళీ ఈ వేదభూమిలో మీజన్మ ఎప్పుడు

కట్టుబాట్ల చెట్లమీద
కులం కులం అంటూ
కాకుల్లా అరిచే...
సాటి మనుషులను
కుక్కలకన్నా హీనంగా చూసే...
ఆరని కులం కుంపట్లను రాజేసే
నిరుపేదల హక్కులను కాలరాసే మనువాదుల మూకల తోకలకే కాదు
నిచ్చెన మెట్ల వ్యవస్థకే నిప్పంటించిన...
ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..!
ఓ మల్లయోధుల వారసుడా....!
మీరు చేసిన...ఈ సాహస కృత్యం..!

సరిగ్గా 97 సంవత్సరాల క్రితం
వర్ణవ్యవస్థ విషవృక్షంగా
విస్తరించే ఉన్నవేళ
మనిషి మనిషి మధ్య
కులం చిచ్చు రగిలించే
బ్రాహ్మణ బైబిల్ వంటి
మనుధర్మ శాస్త్రాన్ని
మంటల్లో విసిరేసి
తగులబెట్టి బూడిద చేసి
మహద్ చెరువులో కలిపేసిన
ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..!
ఓ మల్లయోధుల వారసుడా....!
మీరు చూపిన...ఈ గుండె‌ ధైర్యం..!

కాంగ్రెస్ కొండలనే ఢీకొట్టిన...
అగ్రవర్ణ అనకొండలను...ఎదుర్కొన్న
కోరలు చాచి కసితో బుసలు కొట్టే
కోడెనాగుల తోకలను త్రొక్కిన
పులుల నోట్లో తలదూర్చిన...
ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..!
ఓ మల్లయోధుల వారసుడా....!

 మీ అద్వితీయమైన అపూర్వమైన ఈ వీరత్వం

కులమనే ముళ్ళకిరీటాన్ని
ధరించిన అగ్రవర్ణాల వారికి
కనువిప్పు కలిగించేలా
మనువాదుల మదం అణిచేలా...
కులనిర్మూలన కోసం
జీవిత సర్వస్వం త్యాగం చేసిన
ఓ బాబా సాహెబ్  అంబేద్కరా..!
మీ రెంతటి...ఘనులో త్యాగధనులో
ఈ మట్టి బుర్రలకెప్పుడర్థమయ్యేను..?

ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..!
ఓ మల్లయోధుల వారసుడా....!
ఈ దళితజాతిని జాగృతం చేసేందుకు..!
ఈ వేదభూమిలో మళ్ళీ మీజన్మ ఎప్పుడో..?