Facebook Twitter
వర్తమానం ఒక వరాల జల్లు..!

రేపేమి జరుగునో
ఎవరికీ తెలియదు"
అంటుంది పవిత్ర గ్రంథం బైబిల్
త్రికాలాలలో వర్తమానమే శ్రేష్టం
అందుకే అది నాకెంతో ఇష్టం
కారణం
భవిష్యత్తు...
ఒక భూతమని...
అంధకారమని...
గాడాంధకారమని విచారిస్తూ
చీకటిలో కూర్చొని చింతించే కన్నా
విషాదంలో మునిగి విచారించే కన్నా భవిష్యత్...
బంగారుమయమని...
తలచుకొంటూ తన్మయత్వం చెందడం
చీకటిలో చిరుదీపం వెలిగించడం మిన్న

గతం
ఒక చేదు జ్ఞాపకమని...
గతమంతా
గాయాలమయమేనని...
గుర్తు చేసుకుని
గుండెలు బాదుకునేకన్నా...
గతంలో అనుభవించిన
ఆనంద క్షణాలను...
మరిచిపోలేని మధురమైన
తీపి తీపి జ్ఞాపకాలను...
ఒకసారి మననం చేసుకున్న
మనసుకు కొంత ఉపశమనమే కదా...

గతం కరగని ఒక గట్టి "శిలని"...
భవిష్యత్ తీరం చేరని ఒక "అలని"... వర్తమానం వరాలనందించే "వలని"... భావించి
ప్రతిమనిషి బ్రతికిన చాలు
అనంతమైన తృప్తి...ఆత్మకు కలుగు...
అదే మన జీవితానికి...వెన్నెల వెలుగు...