1...
ఒక జీవిత కాలంలో
ఒక కన్నతల్లి
ఒక కన్నతండ్రి
తమ సుఖశాంతులకన్న మిన్నగా
తమ కలలకు ప్రతిరూపాలైన
తమ కన్నబిడ్డల
బంగారు భవిష్యత్ కోసం...
వారి ఉత్కృష్టమైన జీవితం కోసం...
సంఘంలో గౌరవప్రదమైన బ్రతుకు కోసం
వారి కీర్తి ప్రతిష్టల కోసం...
వారు విశ్వవిజేతలై
ఖండాంతర ఖ్యాతినార్జించడం కోసం...
వారు చరిత్రలో
చిరంజీవులై...మిగిలిపోవాలని...
నింగిలో ధృవతారలై...
నిత్యం వెలుగులు విరజిమ్మాలని...
కమ్మని కలలెన్నో కని...
కడుపు మాడ్చుకొని...ఎన్నో రాత్రులు
కారుచీకటిలో కన్నీరుమున్నీరై...
అప్పుల నిప్పుల కుంపటిపై
నిత్యం నడిచి నడిచి...
అవమానాల జడివానలో తడిచి తడిచి...
"కష్టాల కుక్కలు" కరుస్తున్నా
సమస్యల సునామీలు చుట్టుముట్టినా...
అదరక బెదరక..కంటిమీద కునుకులేక
కడుపునిండా తిండిలేక...
అర్ధాకలితో రోగాలెన్నో
మృత్యు రాగాలు వినిపిస్తున్నా...
2...
సవాళ్ళనెన్నిటినో సహించి...
అవమానాలెన్నో భరించి...
ఇరుగుపొరుగు వారి
అవహేళనలను
ఆభరణాలుగా ధరించి...
పదిమంది పిల్లలను కని
పెంచి పెద్దచేసి...
ప్రేమామృతాన్ని ...పంచినా
కలెక్టర్లను
కంప్యూటర్
ఇంజనీర్లను చేసి
విదేశాలలో విమానాల్లో
ఖరీదైన కార్లలో తిప్పినా...
విలాసవంతమైన విల్లాలు కొనిపెట్టినా...
వెతికి వెతికి
చక్కని సంబంధాలను కుదిర్చినా...
వారి వివాహ వేడుకలను ఘనంగా అంగరంగ వైభవంగా జరిపించినా...
ఆర్జించిన కోట్లఆస్తులను అందరికీ సమంగా సంతోషంగా పంచినా...
3...
ఎందుకో..? ఏమో...?
ఆ పదిమంది పిల్లలు
అమ్మానాన్నలను
"అనాధాశ్రమాలకు అమ్మాలని"
చూస్తారే తప్ప...
మొన్న గోరుముద్దలు తినిపించిన
వారికింత "ముసలిముద్ద" పెడదామని..? వారికింత "ప్రేమను" పంచుదామని...
వారిని కన్నిటీతో కాక
చిరునవ్వులు చిందిస్తూ...
కాటికెళ్ళేలా...చితికిచేరేలా...
మనశ్శాంతితో...తృప్తిగా పంపి
తీరని ఆ కన్నఋణాన్ని కొంతైనా తీర్చుకుందామని...తలంచరే...!
అయ్యో ఓ దైవమా..!
కాసింతైనా కృతజ్ఞత...చూపించరే..!
ఎందుకో..? ఏమో..?
ఈ బంధాలన్ని ఈ నేల మీదనేనా..?
అవి నేటి వరకే ఆ కాటి వరకేనా..?
కనుమూశాక అన్నీ అదృశ్యమేనా..?
ఎవరికి వారు ఎమునా తీరేనా..?
అయ్యో..! ఓ దైవమా..!
ఇదేమి వింత..?
ఇదేమి మాయ..?
ఇవేమి బంధాలు..?
రక్తసంబంధాలు సైతం
బూటకమేనా..?
జగన్నాటకమేనా..?
జీవితమంతా
ప్రేమపోరాటమేనా..?
ఆశలఆరాటమేనా..?



