అమ్మా తల్లీ !
కాస్త జాగ్రత్త సుమా !
దారిలో "ముళ్ళుంటాయి"
గ్రుచ్చుకున్నా పరవాలేదు
కానీ దారిలో కొన్ని
విషపు "కళ్ళుంటాయి"
కామంతో నిండి...కాస్త జాగ్రత్త తల్లీ
కాలేజీకెళ్ళే కన్న కూతురికి
కన్నతల్లి...కన్నీటి హెచ్చరిక...
ఔను ఎటు పోతోంది నా దేశం..?
ఏమైపోతుంది నా భారతదేశం..?
ఎంతగా భ్రష్టుపట్టిందీ సమాజం..?
ఎన్ని చట్టాలుండి ఏం లాభం..?
కామంతో కళ్ళుపొరలు కమ్మిన
ఈ నరజాతికి...
ఈ మానవ మృగాలకి...
సిగ్గూ లజ్జా భయమూ
భక్తి లేకుండా పోతోంది
వయసులో ఆకర్షణ ప్రకృతిధర్మం
వయసొచ్చిన యువతీయువకుల్లో
చాటుసరసం ముద్దూముచ్చట సహజం
కానీ మాయామర్మం ఎరుగనివాళ్ళు
లోకం పోకడ తెలియని వాళ్ళు
నల్లవన్ని నీళ్ళని తెల్లవన్నీ పాలని...
అందరూ మావాళ్ళేనని...
అందరూ మంచివాళ్ళేనని...
మోసానికి వంచనకు దయకు దగాకు...
అర్థం తెలియని అమాయకపు పిల్లలు
నట్టేటముంచే
నయవంచకుల్నే నమ్ముతున్నారు
బుసలుకొట్టే
విషసర్పాల పడగనీడన పవళిస్తున్నారు
కాస్త మంచిగా
మాట్లాడి ప్రేమగా పలకరించి
చిన్న చాక్లెట్ ఇస్తే చాలు
ప్రక్కనే కూర్చుంటారు
వాళ్ళు "కళ్ళు పొరలు
కమ్మిన కామాంధులని" తెలియక
వారినే నమ్ముతారు
వారి వెంటే తిరుగుతారు
వాళ్ళు "కూడుతిని కుండను సైతం
పగగులగొట్టే కుక్కలని" తెలియక
ఐతే ముంచుకొచ్చే
పెనుప్రమాదాలను పసికట్టి
ముందుస్తు హెచ్చరికలు...
చేయకపోవడం తల్లిదండ్రుల తప్పే ?
తామ కడుపున పుట్టిన తమ పిల్లల
వికృతమైన విచిత్రమైన క్రూరమైన
దారుణమైన దుర్మార్గమైన దుష్టతలంపులపై చెడు
స్నేహాలపై నిఘా పెట్టకపోవడం...
కన్న తల్లీతండ్రుల నేరమే?
ఔను చేతులు కాలాక
ఆకులు పట్టుకొని ఏం లాభం?
దొంగలు ఇల్లంతా దోచుకున్నాక
ఇక జాగిలాలొచ్చి లాభమేమి?
పెనుప్రమాదం జరిగాక ప్రాణం
పోయాక ఎంత ఏడ్చి లాభమేమి?
ముందే వుండాలిగా...ముందుజాగ్రత్త...
ఉంటే ముప్పునిప్పై దహించకపోయేదేమో



