Facebook Twitter
పొద్దు వాలిపోతుంది కాయ రాలిపోతుంది

ఎగిరిపోతున్నాయి
...ఎండుటాకులు
కూలిపోతున్నాయి
...ఆశలసౌధాలు
కృంగిపోతున్నాయి
...ఆశయాల పునాదులు
కమ్ముకొస్తుంది
...చిమ్మచీకటి
వినిపిస్తున్నాయి
...విషాదగీతాలు
కలిసిపోతున్నాయి
...గాలిలో తీపిజ్ఞాపకాలు
విడిపోతున్నాయి
...అనుబంధాలు
తెగిపోతున్నాయి
...బంధాలు
సమాధి అవుతున్నాయి
...రాత్రికిరాత్రే రక్త సంబంధాలు
పక్కుమని నవ్వుతున్నాయి
...పెరటిలోని మొక్కలన్నీ...
...నింగిలోని చుక్కలన్నీ.....

నిన్న ...కలిసి...నవ్విన
కమ్మని కబుర్లు చెప్పిన మనిషి
నేడు జీవితమంటే నీటిబుడగని...
ఏక్షణమైనా మాయమౌతుందని...
జీవితమంటే..?
ఎండిపోయిన ఆకేనని...
పండిపోయిన కాయేనని...
నేడోరేపో నేలరాలి గాలిలో
ధూళిలో కలిసిపోక తప్పదని...
హెచ్చరిక చేసిన మనిషే...

నేడు భళ్ళున తెల్లవారినా
ఇంకా కళ్ళుతెరవకపోతే...
వెక్కీ వెక్కీ ఏడుస్తున్నాయి
...ఆర్జించిన ఆస్తులు
...తమను వెంటతీసుకు పొమ్మని...

కన్నీరు కారుస్తుంది...కారు
తన యజమాని పార్థివదేహాన్ని

కాటివరకైనా మోసుకు పోనిమ్మని...

ప్రపంచానికే
ప్రాణాధారమైన
ఈ సూర్యచంద్రులు 
ఈ మనిషి పుట్టి గిట్టేవరకు
ఆహారాన్ని...నిద్రను...నీడనివ్వగలరే
కాని కన్నుమూసి పడివున్న
ఆ కట్టెకింతప్రాణం పోయలేకున్నారు

ఈ సూర్యచంద్రులకన్న శక్తివంతమైన

ఆగ్రహించే గ్రహాలను సైతం నియంత్రించే

అతీంద్రియశక్తి ఏదో విశ్వంలో దాగిఉంది

ఎండిపోయిన ప్రతిఆకు...
పండిపోయిన ప్రతిపండు...
చెట్టు నుండి రాలిపోక తప్పదు
గాలిలో ధూళిలో కలిసిపోక తప్పదు

మట్టిలో పుట్టి‌ పెరిగిన ప్రతి మనిషి
మట్టిగా మారి మాయమైపోతున్నాడు
మంచుముక్కలా కరిగి పోతున్నాడు
తిరిగి రానిలోకాలకు తరలిపోతున్నాడు
ఔను సోదరా మానవజీవితమే ఇంతరా..!
అది ఎవరికీ అంతబట్టని ఒక వింతరా...!!