Facebook Twitter
పలకాలి నోట‌...ఓ మంచి మాట..!

"మనిషి జీవితం
కరిగిపోయే మంచు
అందుకే మంచిని
నలుగురికి పంచు"...అన్నారు
కళారత్న శ్రీ బిక్కీకృష్ణ గారు

మనసుకు హత్తుకునేలా...
దారి దీపాలవంటి...
మంచిమాటలు నాలుగు చెబితే
పోయేదేముంది...చెప్పండి
విని నలుగురు చీకటి నుండి
వెలుగులోనికి రావడం తప్ప...

పాతాళంలో పడిపోయిన
పదిమంది...తిరిగి పైకి లేవడం తప్ప...

చెడిపోయిన బడుగు బలహీన...
బ్రతుకులు బాగుపడడం తప్ప...

వేలమంది...అభాగ్యుల జీవితాల్లో
వెన్నెల వెలుగులు విరజిమ్మడం తప్ప...

అందుకే అంటారు
మంచి మనసుతో
మనం ప్రేమగా ‌పలికే
మధురమైన మాటలే...
వెలుగు కిరణాలని...
మంగళ తోరణాలని...
బంగరు ఆభరణాలని...

మనిషికి మాటలే  ఔషదాలని...
మాటలే మారణాయుధాలని...
మాటలే ముత్యాల మూటలని...
మాటలే ప్రాణాలు‌తీసే తూటాలని...

ఔను కొందరు మాట్లాడితే 
రాలుతాయో లేదొ "నోటిముత్యాలు"
కానీ కొందరు పెదవి విప్పితే‌‌ చాలు
వెలుగుచూసేను ఎన్నో"నగ్నసత్యాలు"

కొందరి మాటలు
"నీటిమూటలు"...
"ఇసుకలో వ్రాతలు"...
కానీ కొందరి మాటలు
శిలలపైన చెక్కిన "శిలాక్ష‌రాలు"...

అందుకే పలకాలి "మీ నోట"... 
మధురమైన "ఓ మంచిమాట"...