అక్రమంగా...అన్యాయంగా...
అవినీతితో కోట్లు కోట్లు ఆర్జించి...
ఖరీదైన పాలరాతి భవనాలు కట్టి... హంసతూలికా తల్పాలపై పవళించినా... రకరకాల రుచికరమైన పదార్థాలతో
నిత్యం విందులారగించినా...
ఏమి లాభం..? ఏమి లాభం..?
ఎంతకాలం ఎంతకాలం ఇదెంతకాలం..?
తెలుసుకో నేస్తమా ఒక పచ్చినిజం..!
ఈ జీవితమే అంతుచిక్కని ఓ ఇంద్రజాలం
ఎన్నో దండయాత్రలు చేసి...
ప్రపంచమంతా విస్తరించి...
రవి అస్తమించని అఖండ
సామ్రాజ్యాలను స్థాపించిన...
మహరాజులే మాయమైపోలేదా..?
రాజ్యాలు రాజసింహాసనాలు రెప్పపాటున
కుప్పకూలి గాలిలోధూళిలో కలిసిపోలేదా?
మరేమిలాభం..? ఏమి లాభం..?
ఎంతకాలం ఎంతకాలం ఇదెంతకాలం..?
తెలుసుకో మిత్రమా ఒక పచ్చినిజం..!
ఈ జీవితమే అంతుచిక్కని ఓ ఇంద్రజాలం
రేపు నీవు ఉండని...
అంతా అశాశ్వతమేనని...
ఏదీ నీది కానీ ఈ నేల నీది కాదని...
ఈ నేలపై నీవు నిర్మించిన కోటలు...
నీవు ఆర్జించిన కోట్ల ఆస్తులు నీవి
కావన్న నిండునిజం నీకు తెలిసినా...
మరెందుకింత అంతులేని ఆస్తిపిచ్చి..?
ఏమి లాభం..? ఏమి లాభం..?
ఎంతకాలం ఎంతకాలం ఇదెంతకాలం..?
తెలుసుకో నేస్తమా ఒక పచ్చినిజం..!
ఈ జీవితమే అంతుచిక్కని ఓ ఇంద్రజాలం



