తప్పు కాదు కానీ పెద్ద తప్పే...?
అప్పు చేయడం...తప్పు కాదు
చేసిన అప్పు తీర్చక పోవడం...
తీర్చని అప్పు ఆరని నిప్పని...
తెలియక పోవడమే...పెద్దతప్పు
పుణ్యాత్ముల సహాయాన్ని
పుచ్చుకోవడం...తప్పుకాదు
చేసిన ఆమేలును మరిచిపోవడం...
తీరం చేరాక తెప్పను తగలేయడం...
కృతజ్ఞతాభావం లేకపోవడమే...పెద్దతప్పు
పడిపోవడం...
తప్పు కాదు...పడినా...
పైకి లేవకపోవడం...
లేచి ఎవరూ ఊహించనంతగా
ఎవరెస్టు శిఖరమంత
ఎత్తుకు ఎదగక పోవడమే...పెద్దతప్పు
ఓడిపోవడం...
తప్పు కాదు...ఓడినా...
నేటి ఓటమే రేపటి
విజయానికి పూలబాటంటూ
మరొక్కమారు విజయం కోసం
ప్రయత్నించక పోవడమే...పెద్దతప్పు
చెడిపోవడం...
తప్పు కాదు...చెడినా...
తెలిసీ తెలియక చేసిన
తప్పును సరిదిద్దుకోక పోవడం...
క్షమించమని అడగక పోవడం....
తాము కడిగిన ముత్యాలమని...
నిరూపించుకోక పోవడమే...పెద్దతప్పు



