మీ హృదయం...
స్వచ్ఛమైన క్షీరసాగరమైతే...
అందులో ఎగసి ఎగసి పడేది
ఆనందపు అలలే మీ కమ్మని కలలే...
మీ హృదయం...
సస్యశ్యామల సాహితీ క్షేత్రమైతే...
అందులో నిత్యం సాగుచేయాలి
కమ్మని కవితల పచ్చని పంటలే...
మీ హృదయం...
నిష్కల్మషమైన నిశ్చలమైన
నదీప్రవాహమైతే మీ "జీవితనావ"
సుఖాలతీరం...చేరడం సుసాధ్యమే...
మీ హృదయం...
సారవంతమైన
పంట పొలమైతే...
అందులో పండేది
ప్రేమ కరుణ జాలి
శాంతియను పచ్చని పంటలే...
మీ హృదయం...
సుందరమైన నందనవనమైతే...
అందులో విరబూసేది రమనీయమైన
రంగుల్లో కమనీయమైన విరుల సిరులే..
మీ హృదయం
కక్ష కార్పణ్యాలతో...
పగా ప్రతీకారాలతో...
అసూయా ద్వేషాలతో...
రగిలే నిప్పుల కుంపటైతే...
మీ జీవితం నిత్యం నరకప్రాయమే...
అది అంతులేని అంధకారబంధురమే...
అందుకే అంటారు
ఇంటిని చూడు...
ఇల్లాలిని చూడమని...
చెట్టును చూడు...
చెట్టు ఫలాలను చూడమని...
మనిషిని చూడు...
మనిషి మాటతీరును చూడమని...
ఔనిది నగ్నసత్యమే మిత్రమా
మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది..
మలినంలేని మీ హృదయదర్పణమే...



