Facebook Twitter
సంసారంలో సఖ్యత...

కుటుంబమనే బండికి
భార్యా భర్తలిద్దరు
రెండుచక్రాలని...
సంసారం ఒక సాగరమని...
సంసారంలో సఖ్యత ఐక్యత
సర్దుబాటుగుణం ముఖ్యమని...

భార్యా భర్తలిద్దరూ
ఒకరిపై మరొకరు అంతులేని...
ప్రేమానురాగాల్ని...ఆప్యాయతల్ని...
కుంభవర్షంలా కురిపించుకోవాలని...
పాలూ నీళ్ళలా కలిసిపోయి
చిలకా గోరింకల్లా ఉండాలే...గాని
పిల్లిఎలుకల్లా చీటికి మాటికి
చిన్నవిషయాలకు గొడవపడరాదని"...

మనసు కళుక్కుమనేలా... 
"కత్తులతో పొడిచినట్లుగా... 
"సూదులతో గ్రుచ్చినట్లుగా... 
"పుండుమీద కారం చల్లినట్లుగా... 
విచ్చుకత్తుల్లా గ్రుచ్చుకునే ఎత్తిపొడుపు... మాటలబాకులేవీ విసురుకోరాదని... 
విడాకులు తీసుకుందాం విడిపోదామంటూ
పదేపదే...అదేపనిగా...అనరాదని.... 

ఇక కలిసి ఉండలేమని...
కాపురం చెయ్యలేమని...
అతకని మనసులతో చితికిన...ఈ
అతుకుల గతుకుల బ్రతుకుబండిని...
ఇక లాగలేమని చతికిలపడిపోరాదని...

ఇద్దరి మధ్య అదృశ్యంగా
అడ్డుగోడలు నిర్మించుకోరాదని...
పెంచుకున్న బంధాలన్నీ త్రెంచుకోరాదని...
కలతలు కలహాలు లేని కాపురం లేదని
భార్యా భర్తలు దేన్నీతెగేదాకా లాగరాదని
ముఖాముఖి చర్చలే మనస్పర్థలకు...
మందులని...ఆ లౌక్యం ఎరుగని
ఆలూ మగలిద్దరూ అంధులేనని...

ఐతే...
వివాదం ముదిరి...
విడిపోతే విషాదమని...
కలిసి ఉంటేనే ఇద్దరు కలదు సుఖమని...
సఖ్యత ఉన్న సంసారమే ఒక స్వర్గసీమని...
జగడాలులేని జంటలే అందరికీ ఆదర్శమని
దంపతులిద్దరు ఈసత్యం తెలుసుకోవాలని.