Facebook Twitter
నడక...పడక…

ఉదయం నిద్ర లేచి...
కదలకుండా కుర్చీలో
కూర్చుంటే క్రుంగుబాటే...
అలా కాస్త ఆరుబయట నడిస్తే...

ఆ పచ్చని ప్రకృతితో...
ఆ చల్లని గాలితో...
నీరెండనిచ్చే
ఆ సూర్యభగవానితో...
ఆ వెచ్చని వెలుగుతో...
పార్కులో నీకు నచ్చిన
నీ ఆత్మీయ మిత్రులతో
కాసేపు సంభాషిస్తే ఎంత సంబరం...

కానీ నీవు ఇంట్లో ఉంటే 
నిన్ను విసుక్కునే
నీ పడకతోనో... 
పైన తిట్టుకుంటూ
తిరిగే ఫ్యానుతోనో... 
నవ్వే నాలుగు గోడలతోనో
మాట్లాడవలసిందే మౌనంగా..!

లైటు లేకుండా గదిలో
ఒంటరిగా ఉంటే.‌‌..
చీకట్లతో పిచ్చిగా ముచ్చట్లే!
లేదా నీలో దాగి ఉన్న
నీ అంతర్గత శత్రువులైన
ఆ అరిషడ్వర్గాలతో ఆడుకోవాల్సిందే..!

అందుకే మిత్రులారా..!
ఇక మనమే తేల్చుకోవాలి
గదిలో గబ్బిలాలుగా ఉందామా..?
అదిగో ఆరుబయట ఆకాశంలో 
ఆ పక్షుల్లా స్వేచ్ఛగా విహరిద్దామా..?

ఓ నా ప్రియ మిత్రులారా..!
నా ఈ కవితను ఇంతసేపు ఓపికతో
చదివిన మీరే ఇక ఆలోచించి చెప్పాలి...!