1 మంచి ఆలోచన
10 చెడు ఆలోచనల్ని
మంచి వైపునకు నడిపిస్తుంది..!
1 చెడు ఆలోచన
1000 మంచి ఆలోచనల్ని
కలుషితం చేస్తుంది...
గంగలో కలిపేస్తుంది...
కాల్చి బూడిద చేస్తుంది...
పాతాళంలో పాతిపెడుతుంది..!
ఔను మన మనసే కదా
మన మంచి చెడు
ఆలోచనల జలపాతం...
మన మనసే కదా
మంచి చెడుల ఊహాల ఊట..!
మన మనసే
మంచికి పందిరైతే...
అది ఒక దైవ మందిరమే..!
మన మనసే
చెడుకు నీడైతే...
తోడైతే ఒక గూడైతే..!
అది దుర్గంధాన్ని
వెదజల్లే ఒక మురికి గుంటే..!
అది వీధిలో
ఎంగిలి విస్తరాకులు
నిండిన ఒక చెత్త కుండే..!
అది నిన్ను నన్ను
ఉక్కిరిబిక్కిరి చేసి
ఊపిరి తీసే ఒక ఊబే..!
అందుకే ఓ మిత్రమా..!
తెలుసుకో ఓ నగ్నసత్యం
నీవు చేసే సత్సంకల్పాలే
నీ పురోభివృద్ధికి పునాదులని..!
నీవు చేసే దుష్ట తలంపులే
నీ సంక్షేమానికి సమాధులని....!
ఔను ఓ మిత్రమా..!
చెప్పాలి నీవు సత్సంకల్పాలకు
స్వాగతం...సుస్వాగతం ఘనస్వాగతం..!
ఉండాలి నీవు దుష్టతలంపులకు
దూరంగా...లక్ష అడుగుల సుదూరంగా..!



