Facebook Twitter
చేతివేళ్ల సందేశం..?

ఒక వ్యక్తిని నీవు
నీ చూపుడు వేలుతో
కోపంతో ఘాటుగా
ప్రశ్నిస్తున్నావంటే...
నిప్పులు చెరుగుతూ
నిందిస్తున్నావంటే...
ఓ 3 వేళ్ళు నీ వైపు చూస్తున్నాయని...
నిన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నాయని...
తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!

నీ చేతివేలి మీద
ముద్రించే సిరాచుక్క
నేతల తలరాతల్ని మార్చివేస్తుందని...
ప్రజానాయకులకు ప్రాణం పోస్తుందని... తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!

మన చేతి 5 వేళ్ళు
సమంగా లేకున్నా
పిడికిలి బిగించినప్పుడు
అన్ని వేళ్ళు సమంగా ఉంటాయని...
మనలో రక్తాన్ని ఉరకలు వేయిస్తాయని...

పాలకుల్ని ప్రశ్నిస్తాయని ప్రతిఘటిస్తాయని
తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!

మనం జీవితంలో
పంతాలకు పట్టింపులకు పోక
ఓ మెట్టుదిగితే...రాజీమార్గంలో
పయనిస్తే పోయేదేమీ లేదని...అప్పుడు
అందరి జీవితం ఒక ఆనందసాగరమేనని..!
తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!

తాళంచెవి లేకుండా తాళం లేదన్న...

పరిష్కారం లేకుండా సమస్య లేదన్న...

గొప్ప పరమ సత్యాన్ని తెలుసుకొని...
ప్రతిమనిషి ప్రశాంతంగా జీవించాలని...
తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!