ఎక్కడా కలవనినాడు
ఏపరిచయంలేనినాడు
ఎవరికి ఎవరు తెలియనినాడు
వారిద్దరు..."అపరిచితులు"
ఏదో సందర్భంలో అనుకోకుండా
కాకతాళీయంగా కలిసినప్పుడు
మాట మాట కలిసినప్పుడు
ఒకరి భావాలను ఒకరు
ఒకరి బాధలను ఒకరు
ప్రేమతో పంచుకున్నప్పుడు
వారిద్దరు..."స్నేహితులు"
అప్పుడప్పుడు కలిసినప్పుడు
మాట మాట కలిసినప్పుడు
చూపు చూపు కలిసినప్పుడు
మనసు మనసు కలిసినప్పుడు
ఒకరిని ఒకరు కోరుకున్నప్పుడు
వారిద్దరు... "ప్రేమికులు"
ఇద్దరు ఒకరితో ఒకరు
జీవితాన్ని పంచుకోవాలని కలిసి
బ్రతకాలని భావించినప్పుడు
నిశ్చితార్థం జరిగినప్పుడు
పెళ్ళి పీటలెక్కినప్పుడు
వివాహబంధం ఏర్పడినప్పుడు
వారిద్దరు..."నూతన వధూవరులు"
ఆపై శోభనం జరిగినప్పుడు
పడకగదిలో పట్టెమంచంలో
ఇద్దరు ఒక్కటై పోయినప్పుడు
కలిసి కాపురం చేసినప్పుడు
సంతానం కోసం తపించినప్పుడు
వారిద్దరు..."భార్యాభర్తలు"
ఆ ఇద్దరు ముగ్గురు కావాలని
కమ్మని కలలు కన్నప్పుడు
ఆకలలు నిజమైనప్పుడు
కడుపు పండినప్పుడు
పాపో బాబో పుట్టినప్పుడు
వారిద్దరు..."తల్లీదండ్రులు"
వారి పిల్లలకు
పెళ్ళిళ్ళు చేసినప్పుడు
వారిద్దరు..."అత్తామామలు"
ఆ పిల్లలకు
పిల్లలు పుట్టినప్పుడు
వారిద్దరు..."అవ్వాతాతలు"
వారికి కంటిచూపు కరువైనప్పుడు
కాళ్ళల్లో నడిచే సత్తువలేనప్పుడు
అందరిపై ఆధారపడుతున్నప్పుడు
వారిని భారంగా భావించినప్పుడు
వృద్ధాశ్రమంలో వదిలి పెట్టినప్పుడు
వారిద్దరు..."అందరుఉన్నా అనాధలు"
ఆకలికి అలమటించే..."అస్థిపంజరాలు"
ఎవరినీ నిందించలేని..."నిస్సహాయులు"
వారే కన్న కమ్మని కలలన్నీ కల్లలై
మరలిరాని లోకాలకు తరలిపోతున్న
నిన్న దైవం దీవించిన ఆదర్శ"దంపతులు"
నేడు ఆ దైవమే శపించిన "భార్యాభర్తలు"



