నిన్న మీ
ఆకలి తీర్చిన
మీ అమ్మానాన్నలను
నేడు ఆకలికి ఆలమటించే
"అస్థిపంజరాలుగా" మారుస్తారా?
అనాధాశ్రమాలకు"అతిథులను"చేస్తారా ?
రెక్కలు విరిగిన
ఆ "ముసలి పక్షుల్ని"
"అనాధలుగా అభాగ్యులుగా"
"ఎంగిలి విస్తరాకుల్లా"వీధుల్లో విసిరేస్తారా?
రక్తమాంసాలను పంచి
రక్తాన్ని స్వేదంలా చిందించి
పెంచి పెద్ద చేసిన మీ అమ్మానాన్నల
యెడల రక్తసంబంధాలను
మరచి " రాక్షసుల్లా" ప్రవర్తిస్తారా?
ప్రేమ వాత్సల్యం మానవత్వం లేని
ఓ "మాయదారి కొడుకుల్లారా"...!
కరుణ జాలి దయా దాక్షిణ్యం లేని
ఓ"కఠినాత్ములైన కన్న కూతుళ్ళారా"...!
మీరు ఆకాశమంతా
ఎత్తుకు ఎదగాలని
మీ బంగారు భవిష్యత్తు కోసం
కమ్మని కలలెన్నో కంటూ
" కొవ్వొత్తుల్లా " కరిగిపోయిన
మీ అమ్మానాన్నలే కదా "ప్రత్యక్ష దైవాలు"
అట్టి అమ్మానాన్నలు ఆర్జించిన
ఆస్తుల్ని దోచుకొని దాచుకున్న
"దోపిడీ దొంగలే " కదా మీరు...
అడ్డదారిలో గడ్డిమేస్తూ...
బ్రతికే "గుడ్డిగాడిదలే " కదా మీరు...
మీ కంటే కూడు తిని కుండలను సైతం
పగులగొట్టే..."ఆ కుక్కలే " నయం గదా...
అందుకే ఇక...మీరే తేల్చుకోండి మీరెవరో...



