Facebook Twitter
ఉడతలకేల ఉచిత సలహాలు..!

మిత్రులారా !
మీకు చేతులు జోడించి
చేస్తున్న నా చిరువిన్నపమొక్కటే..!

అడగకనే ఆవేశపడి
తొందరపడి ఎవరికీ మీరు
ఉచిత సలహాలివ్వకండి..!
"మంచి జరిగితే" మరిచి పోతారు
"చెడు జరిగితే" జీవితాంతం
మిమ్మల్ని దూషిస్తూనే ఉంటారు

గుండెలు కలుక్కుమనేలా
నిందలు వేస్తూనే ఉంటారు
నిప్పులు చెరుగుతూనే ఉంటారు
కనిపిస్తే ఉరిమి చూస్తారు
ఉరివేస్తారు ఊపిరి తీస్తారు

నిజానికి ఎంతో శ్రమకోర్చి ...
ఎంతో విలువైన సమయం వెచ్చించి...
ఒక మంచి పెళ్లి సంబంధం కుదిర్చితే...
ఆ సంసారం సాఫీగా సాగినంతకాలం
ఆ జంట కనులపంటగా ఉన్నంతకాలం
ఆ సంబంధం కుదిర్చినవారు...దేవుళ్ళే...

ముక్కోటి దేవతలు దీవించి
మూడు ముళ్లు వేయించినా
విధి పగబడితే...పచ్చని కాపురాల్లో
అపార్ధాలు పెరిగి ఆరనిచిచ్చు రగిలితే...

వారి వక్రబుద్ది వంకర ఆలోచనలతో...
వారి మొండితనంతో అహంకారంతో...
కొత్తగా ఏర్పడిన అక్రమసంబంధాలతో...
ఆస్తులపై ఆశతో కట్నాల మీద మోజుతో...
తొలినాటి స్వచ్చమైన ప్రేమలు తరిగిపోయి

పగ ప్రతీకారాలు పెరిగిపోయి...
ఒకరంటే ఒకరికసహ్యం కలిగి...
ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటే...

నిజానికి
వారు ఇతరుల
మీద నిర్దాక్షిణ్యంగా
నిందలు మోపడం తప్ప...
తమ లోనికి తాము తొంగిచూడరు...
తమ తప్పులు తాము తెలుసుకోరు... 
తమ అంతరాత్మను తాము అడగరు...
తమ లోపాలను తాము సరిదిద్దుకోరు...
తమ నోరును తాము అదుపులో పెట్టుకోరు

చక్కని కాపురాన్ని
ముక్కల్జేసే తమ ముక్కుమీది
కోపాన్ని తాము నియంత్రించుకోరు...

సమస్యను పరిష్కరించేందుకు...
చిత్తశుద్ధితో ప్రయత్నించరు...
తమ "మొండితనాన్ని"
తమ "అహంకారాన్ని" ఒప్పుకోరు...
"ముఖాముఖి చర్చలకు" సిద్ధంకారు...

కానీ అభిప్రాయాలు కుదరక...
‌సమస్యలు పరిష్కరించుకునే
సహనం...సమయస్పూర్తి లేక...
అనుమానాలు అపార్ధాలు పెరిగి...
ఇద్దరి మధ్య ఒక అగాధం ఏర్పడి...

జాతకాలే తారుమారై...
జగడాలమారి జంటలు విడిపోయి..
విడాకులు తీసుకుంటే...
బాధ్యులెవరు? భగవంతుడా..?...కాదు
సంబంధం కుదిర్చిన మీరా.....?...కాదు

అంతా స్వయంకృతాపరాధమే...
తమ మొండితనమే...తమ గర్వమే...
తమ అహంకారమే...తమ అవివేకమే...
తమ అజ్ఞానమే...తమ అమాయకత్వమే...

అందుకే అద్దం
ముందు నిల్చుంటే అర్థమౌపోతుంది ...
ఆ కార్చిచ్చుకు
అసలు కారకులెవరో తేలిపోతుంది...
ఇంట్లో ఎలుక దూరిందని
ఇల్లు తగలబెట్టుకున్నదెవరో...
తాము కూర్చున్నకొమ్మను నవ్వేస్తూ
నరికేసుకున్నదెవరో...తెలిసిపోతుంది...

మిత్రులారా..!తెలుసుకోండి..!
అడగని ఉడతలకు ఉచిత
సలహాలివ్వడం అజ్ఞానమని...
తలమీద తాటికాయ పడినట్లేనని...
మంచికోసం పోతే ఎదురయ్యేది చెడేనని...
తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డభేరమని