యాదికి తెచ్చుకో బిడ్డా !
ఒక్కతూరి నీ బాల్యంలో
నీవు "నా ఈ గుండెల"
మీదనే...ఆడుకున్నావు
అల్లరి చేష్టలు చేసి చేసి
అలిసిపోయి...పడుకున్నావు
నీ నునులేతపాదాలతో
నా ఈ గుండెల మీదనే…తన్నావు
ఆ "తీపిజ్ఞాపకాలింకా " చెరిగిలేదు
నిన్ను నా భుజాల మీద
ఎత్తుకొని నీవు
"ఎవరెస్టు" శిఖరమంత
ఎత్తుకు ఎదగాలని నీవు
"తండ్రికి తగ్గ తనయుడుగా"
"బాధ్యతగల పౌరుడిగా" బ్రతకాలని ఎన్ని
"కమ్మని కలలు" కన్నానో...నీకు తెలియదు
ఈ గుండెల్లో ఎన్ని "అగ్నిపర్వతాలు"
బ్రద్దలయ్యాయో...నీకు తెలియదు
ఈ గుప్పెడు గుండెలో ఎన్ని
"ఆశలు" దాగున్నాయో...నీకు తెలియదు
ఒక్కసారి విను బిడ్డా !
నా గుండెలోని "లబ్ డబ్ శబ్దం"
నీ కోసం నీ "బంగారు
భవిష్యత్ భవననిర్మాణం" కోసం
నేనెంతగా "తపించానో "...ఎంతగా
"తల్లడిల్లి పోయానో " తెలుస్తుంది...
ఓ నా బంగారు బిడ్డా !
నా "ఆశ" ఒక్కటే...
నన్ను ఏ ఆనాధాశ్రమంలో
ఒక "అనాధగా" చేర్చకు...
నా గుండెల్లో "గునపాలు"
గుచ్చకు నేను భరించలేను...
ఓ నా బంగారు బిడ్డా ! నీవెప్పుడూ
"తప్పుడు పనులు" చేయకు...
నాకు..."తలవంపులేవీ"...తేకు...
నా "పరువును" నిలువునా చెట్టులా
నరికి వేయకు...నేను తట్టుకోలేను.
ఓ నా బంగారు బిడ్డా !
మీ నాన్న చిట్టచివరి " కోరిక "ఒక్కటే...
నా ఈ గుప్పెడు గుండెను " పిండిచేయకు"
నిజానికి "నలిగి పోయేది" నేను కానేదు
నా గుండె నిండా వున్న " నీ ప్రతిరూపమే "



