నల్లవన్ని నీళ్లని...
తెల్లవన్ని పాలని...
నమ్మి మోసపోయే
ఓ నా మిత్రులారా..!
ఇదిగో మీకొక
చిరు సందేశం..!
కాదు చిరుహెచ్చరిక..!
పిచ్చి కుక్కలు
గుంట నక్కలు
ఎక్కడుంటాయి...?
ఎక్కడో కాదు మన చుట్టే అందుకే
జాగ్రత్త..!జాగ్రత్త..!జరా జాగ్రత్త సుమీ..!
ఈ సభ్యసమాజంలో...
నాగరికత ముసుగులో
మన వెనుకే ఉంటారు
నమ్మించి నట్టేట
ముంచే నయవంచకులు...
మనల్ని వెన్నుపోటు
పొడిచే కొత్త మిత్రులు...
అనుకూల శత్రువులు...అందుకే
జాగ్రత్త..!జాగ్రత్త..!జరా జాగ్రత్త సుమీ..!
ఓ నా మిత్రులారా..!
మన ముందే ఉంటారు
కడుపులో కత్తులుంచుకొని
కౌగిలించుకునే నరహంతకులు...
మన వెనుకే ఉంటారు
తియ్యగా నీతులు చెబుతూ...
లోతుగా గోతులు తీసే కోతులు...
మన ప్రక్కేఉంటారు సీటుబెల్టుతో
గొంతునులిమి ప్రాణాలు తీసే...
పరమ కిరాతకులు...అందుకే
జాగ్రత్త..!జాగ్రత్త..!జరా జాగ్రత్త సుమీ..!
ఓ నా మిత్రులారా...
ఈ మేకవన్నె పులులను...
ఈ తేనెపూసిన కత్తులను...
ఒక కంట కనిపెట్టి ఉండాలి
వారి మాయమాటలపై...
వారి నయవంచనలపై...
వికృత చేష్టలపై...
దురాలోచనలపై...
దుష్ట స్వభావంపై...
నిక్కచ్చిగా కాసింత నిఘా పెట్టి
అప్రమత్తంగా ఉండాలి...
అరణ్యంలో తిరిగే
పులులనైనా చిక్కితే చీల్చే
సింహాలనైనా నమ్మవచ్చునేమో...
కానీ చిరునవ్వులు చిందిస్తూ...
చితిమంటలు రేపే...
బంగారు భవిష్యత్తును
బలితీసుకునే...
కాల్చి బూడిద చేసే...
ఈ మానవమృగాలను...
ఈ పాతాళ భైరవులను...
ఈ మాయల మరాఠీలను...
ఈ తాంత్రిక మాంత్రికులను...
నమ్మరాదు నమ్మరాదు...నమ్మనేరాదు
(ఫోటో గ్రాఫర్ సాయి
ఆత్మకు శాంతి కలుగునుగాక...)



