Facebook Twitter
శత్రువును ద్వేషించకు...ప్రేమించు...

నీ తలపైకెక్కి..వాడు
తైతక్కలాడుతున్నాడే...
శివతాండవం చేస్తున్నాడే...

అదును చూసి నిన్ను
అధఃపాతాళానికి తొక్కేస్తున్నాడే...
నిన్ను లెక్కచేయకున్నాడే
తిక్కశంకరుడంటూ గేళి చేస్తున్నాడే...
వాడు నీకు బద్దశత్రువు కాదా..?

వాని తప్పులు వాడు తెలుసుకునేదెప్పుడు? వానికి
జ్ఞానోదయం కలిగించేదెప్పుడు..?

కనువిప్పు కలిగించక
వాడినెందుకు క్షమిస్తున్నావ్..?
అది నీ మంచితనమా నీ పిరికితనమా..?

వాడు కఠినమైన శిక్షకు అర్హుడు మరి
వాన్నెందుకు నిర్దోషిగా వదిలేస్తున్నావ్..?
వానికెందుకు గుణపాఠం నేర్పకున్నావ్..?

ఔను మిత్రమా..!
నీ నిందలో నిజమున్నది కానీ
ఒక బాంబుపెట్టిన పార్సల్ ని
"స్వీకరిస్తే"... నీవు బలి కావచ్చు
కానీ తిరిగి దాన్ని..."రిటర్న్ పంపిస్తే"
పంపినవాన్నే అది బలి తీసుకోవచ్చు
ఇదే స్థితప్రజ్ఞుడైన సిధ్ధార్ధుని సత్యసందేశం...

ఒకని అజ్ఞానమే...
ఒకని అహంకారమే...
వాన్ని దహించే అగ్నిగుండాలు...
ఒకని "పాపానికి జీతం" మరణమే...
ఇదే పవిత్రగ్రంథం ప్రవచించే దివ్యప్రబోధం...

అందుకే ఓ నా ప్రియమిత్రమా..!
నీవు కన్నుమూసి కాటికెళ్ళేలోగా
నీ శత్రువుల్ని మిత్రులుగా మార్చుకుని
ప్రశాంతంగా సమాధికి చేరు...
బద్దశత్రువులు సైతం
స్మరించాలి నిత్యం‌ నీ పేరు....