జనాన్ని జలగలా పీల్చి
లక్షలార్జించే లంచగొండి
కుభేరుడైననేమిరా వాడు
కుక్క కన్న హీనమురా..!
నీతిలేని బ్రతుకు కన్న ఈ
జగాన నీచమైనదేమున్నదిరా..!
"అన్న" పోలన్న సుభాషితం..!
"విన్న" మీకు శుభోదయం...!!
64. దగాపడిన దైవం..?
రక్తాన్ని
స్వేదంగ మార్చి...
రెక్కలు
ముక్కలు చేసి...
దుక్కి దున్ని...
బంజరు నేలలో
బంగారు పండించి...
ఆకలి తీర్చేటి
అన్నదాతే కదరా
ఈ ధరణిలో నడిచే దైవం...
అట్టి ఆ దైవమే
పండించిన పంటకు
గిట్టుబాటు ధర లేక
గిలగిల కొట్టుకోవడమా..?
అట్టి ఆ దైవమే...
అస్థిపంజరమై ఆకలితో
అలమటించడమా..?
అప్పులతో
ఆత్మహత్య చేసుకోవడమా..?
అర్థాంతరంగా
అసువులు బాయడమా...?
అయ్యో ఏమిటీ ఘోరం? ఇదెవరి నేరం..?
ఏమిటీ దారుణం? దీనికెవరు కారణం...?
చేసిన వాగ్దానాలను
మరచిన ప్రభుత్వపాలకులా...?
అసమర్థులు అంధులు
అవినీతిపరులైన అధికారులా..? ఎవరు..?



