Facebook Twitter
కారు" చీకటిలో కలిసి పోకండి..?

కొత్త సేద్యగాడు పొద్దెరగడు
కొత్త పెళ్లికొడుకు ముద్దెరగడు...అన్నట్లు

మొన్ననే నాన్న
కొనిచ్చే...కొత్త కారు...
పార్టీ జోష్ లో కుర్రకారు...
త్రాగిన మైకంలో రిటర్న్ జర్నీలో
జెట్ స్పీడ్ లో మెరుపు వేగంతో
ఓ ఆర్ ఆర్ లో కారులో షికారు...
నా సామిరంగా....ఆ త్రిల్లే వేరు...
ఆ ఖుషీ ఆ ఆనందం...ఏరులై పారు...

ఎన్ని హైదరాబాద్
దమ్ము బిర్యానీలు తిన్ననేమి..?
ఎన్ని కాస్ట్లిబీర్లు కొట్టిననేమి...?
ఎంత ఫారిన్ మందు త్రాగిననేమి..?
ప్రక్కనే ఓ చక్కనైన చుక్క ఉన్ననేమి..?
ఆ "కిక్కే"వేరు...మామ...ఆ"లక్కే"వేరు..!

అయ్యో...మామా...ఘోరం...ఘోరం
ఏమైంది మామా ? మందెక్కువైందా?
పిడుగు నెత్తినపడిన పిల్లిలా అరుస్తున్నావ్

లేదు మా...మా... అదిగో
ఎదురుగా...ఏనుగులా...
యముడిలా...లోడులారి వచ్చేసింది
మన కారును గుద్దేసింది
కారు డివైడర్ ను ఢీకొట్టి
ఎగిరి గాలిలో గిరికీలు కొట్టి
కరెంట్ స్తంభాన్ని గుద్దేసింది కారులో
ఉన్న మనమంతా నుజ్జునుజ్జైపోయాం

ఇప్పుడు మనమున్నది
హాస్పటల్లో ఐసీయూలో
చావు బ్రతుకుల్లో ఉన్నాం...
రేపు బ్రతికి బట్ట కడతామో లేదో
ఆ భగవంతుడికే ఎరుక...! నిజమే

కారు మనదే దాని ఓనర్లం మనమే
"కారులో షికారు" చేస్తున్నంత సేపు
ఆకాశపు అంచుల్లో ఊరేగుతాం...
ఒళ్ళు మరిచి గాలిలో తేలిపోతాం...

కానీ మన జాతకాలే తారుమారైతే...
ఆ క్రూరమైన విధి మనపై విషం గ్రక్కితే...
ఘోరమైన "కారు"ప్రమాదాలకు గురౌతాం
మృత్యువు "కోరల్లో" చిక్కుకుపోతాం...
క్షణాల్లో "కారు"చీకటిలో కలిసిపోతాం...

మన "కారే"
మన స్టేటస్ కు సింబల్
మన "కారే" మనల్ని
సంతోష సాగరంలో ముంచేది
మన "కారే" మన కొంప ముంచేది
మన "కారే" మనల్ని..."ప్రేమించే శత్రువు"
మన "కారే" మనకు"కనిపించని మృత్యువు"

అందుకే ఓ యువతా ! మీరు కారు ఎక్కేముందు...స్టీరింగ్ త్రిప్పేముందు
బ్రేకు త్రొక్కేముందు....
ఒక్క విషయం గుర్తుంచుకోండి...
కారులో మీ విహారయాత్ర...
కారాదు కాటికి చేరే శవయాత్ర...