దీనుల జీవితాలలో దీపకాంతులెక్కడివి?
కొందరి జీవితాలే
విందులమయం వినోదాలమయం
అభాగ్యుల జీవితాలు అంధకార మయం
మధ్య తరగతి బ్రతుకులు కన్నీటిమయం
మొన్న కరోనా రగిల్చిన
కారుచిచ్చుకు ఇంటింట కన్నీరే
మనిషి మనిషి మధ్య ఆరనిమంటలే
చితికిపోతే చిరువ్యాపారుల బ్రతుకులు
ఎక్కడిది ఇంకెక్కడిది దీపావళి వెలుగు ?
నిన్న కురిసిన కుంభవర్షాలకు
కుదేలుమన్నవి కుటుంబాలెన్నో
చిరుఉద్యోగుల జీవితాలలో
కమ్ముకుంటే దట్టంగా చిమ్మచీకట్లు
ఎక్కడిది ఇంకెక్కడిది దీపావళి వెలుగు ?
నిన్నటి అకాల వర్షాలకు
చేతికందిన పంట చేజారిపోయే
పగపట్టిన ప్రకృతి
నోటకాటిముద్దను నీటిపాలుచేసే
రైతన్నల ఆ గుండెకోత, ఆ ఆరని ఆవేదన
అన్నదాతల ఆ మానసిక క్షోభ వర్ణణాతీతమే
ఎక్కడిది ఇంకెక్కడిది దీపావళి పండుగ ?
ఆ కారుచీకట్లు తొలిగేదెప్పుడో?
ఆ అభాగ్యుల జీవితాల్లో
కాంతిరేఖలు వెలిగేదెప్పుడో? ఎవరికెరుక
ఎక్కడివి? ఎక్కడివి?
ఈ దీనుల జీవితాలలో దీపకాంతులెక్కడివి?



