నేడు ఎర్రని
ఎండలో చీమల్లా
మాడుతున్నా
మట్టి జల్లుతారు
కాళ్లకు ముల్లులా
గుచ్చుకుంటున్నా
కంకర అల్లుతారు
అంటువ్యాధి లాగ
ఒంటికంటుకున్నా
తారు చల్లుతారు
రెక్కలుముక్కలు చేసి
ఎర్రని రక్తాన్ని నల్లని
తారుగా తయారుగామార్చి
కాలే కడుపుల సాక్షిగా
రాలే చెమటచుక్కల సాక్షిగా
ఓ చక్కని రోడ్డునేస్తారు కూలీలు
నిజానికి...
చేతిలో చిల్లిగవ్వలేని వాళ్ళు
సరిగ్గా ఒళ్ళు కప్పుకోని వాళ్ళు
కడుపునిండా తిండిలేని వాళ్ళు
అద్దెఇళ్ళల్లో ఇబ్బంది పడేవాళ్ళు
పల్లెతప్ప పట్నం ముఖం చూడని వాళ్ళు
ఆకలితప్ప అక్షరంముక్క ఎరుగని వాళ్ళు
పాపం ఈ పల్లెటూరి వలస కూలీలు...
వారి స్వేదబిందువులతో తయారైన
ఆ తారు రోడ్లమీద రాకెట్ వేగంతో
దూసుకుపోయే ఆ ఖరీదైన
హైటెక్ బస్సులెక్కేది ఎప్పుడు ?
భాగ్యనగరాని వారు దర్శించే దెప్పుడు ?
ఆ బంగారు అవకాశం దక్కెది అక్షరం ముక్కతోనే
విధివ్రాతలు సైతం మారేది విధ్యాదాతలతోనే ఔను
బడికి వెళ్తే చాలు వారి బ్రతుకులు "హైటెక్ బస్సులే"
చదువుకుంటే చాలు వారి జీవితాలు "సిమెంటు రోడ్లే"



