కరోనా కళ్ళల్లో ఏముంది?
కాలకూట విషముంది
కరోనా చేతుల్లో ఏముంది?
అందర్నీమట్టుపెట్టే మందుపాత్రుంది
కరోనా కడుపులో ఏముంది?
కుటుంబాలను
కూల్చేకుట్ర కుతంత్రముంది
కరోనా మనసులో ఏముంది?
మానవాళిని అగ్నికి
ఆహుతి చేసే ఆలోచన వుంది
కరోనా హృదయంలో ఏముంది?
కరాళనృత్యం చేసే, కనిపించక
కాటువేసే అకాలమృత్యువుంది
కరోనా ఇప్పుడెం చేస్తుంది?
శవాలమీద చిందులేస్తుంది
విందులు చేసుకుంటుంది
కరోనా ఎందుకు విరగబడి నవ్వుతోంది?
శవాలు శ్మశానాల్లోజౙ
గుట్టలుగుట్టలుగా పడిఉన్నందుకు
కరోనా ఎందుకు
విశ్వమంతా విస్తరిస్తూ విర్రవీగుతుంది?
ఉగ్రరూపం దాల్చిన కరోనా కాళ్ళకింద పడి
అగ్రరాజ్యాలు సైతం అల్లాడిపోతున్నందుకు
కరోనా ఎందుకంత సంతోషంగా ఉంది?
కడచూపైనా దక్కలేదని
కుటుంబీకులు, బంధువులు
గుండెలు పగిలేలా రోదిస్తున్నందుకు
ఈ ఘోరకలి ఆగేదెప్పుడు ?
ఆ కరోనా రక్కసి ఆకలి తీరేదెప్పుడు?
ఏ వ్యాక్సినో, మందో కనుగొన్నప్పుడు
అందాకా మనకు ఆయుధాలు...ఐదు
వ్యక్తిగత శుభ్రత - ముఖానికి మాస్కులు
భౌతిక దూరం - సెల్ఫ్ లాక్ డౌన్...ఆత్మ స్థైర్యం



