కరోనా కళ్ళల్లో ఏముంటుంది?
కాలకూట విషముంటుంది...
కరోనా కడుపులో ఏముంటుంది?
అకాల మృత్యువు దాగివుంటుంది...
ప్రపంచ కుబేరులైనా
ఎంతటి మేధావులైనా
శ్రీమంతులైనా శక్తిమంతులైనా
రాజులకు రాజులైనా
ప్రభులకు ప్రభువులైనా
ఎన్ని శాసనాలు చేసినా
ఎన్ని దేశాలను జయించినా
ఎన్ని సామ్రాజ్యాలనాక్రమించినా
బంధువులున్నా బలగమున్నాఎగగ మీకు
మందీమార్భలమున్నా
మరఫిరంగులున్నా
నింగికెగిరే గాలిని
నిముషమైనా నిలబెట్టలేడని
కోట్లున్నా సరే ప్రాణాన్ని కొనలేడని
కళ్ళుమూసుకుని కరోనా మృత్యువుకు
మోకరిల్లవలసిందేన్న నిజం తెలిసింది
నిన్న మాయదారి కరోనా వచ్చి
మనుషుల్లో పెనుమార్పుల్ని తెచ్చింది
మనిషి ఆలోచనలు మారి
బంధాలు బాంధవ్యాల మీద
భ్రమలు తొలగి
ఆస్తిపాస్తులమీద ఆశలు సన్నగిల్లి
కాలమెంత విలువైందో
ప్రాణమెంతో ఖరీదైందో అర్థమైంది
ఔను ఈ భూమి మీద ప్రతిజీవి
కళ్ళు తెరవడానికి, బ్రతకడానికి
వినడానికి తినడానికి కనడానికి
ఆలోచించడానికి ఆర్జించడానికి
అనుభవించడానికి,అస్తమించడానికి
అన్నింటికి కనిపించని ఆ పరమాత్మే కారకుడని
ఈ నరుడు నిమిత్తమాత్రుడన్న నిజం తెలిసింది



