Facebook Twitter
ఈ ప్రశ్నకు బదులేది?..

నిద్దురలేచింది మొదలు

అనునిత్యం నిష్టాగరిష్టులై 

ముక్కోటి దేవుళ్ళ, దేవతల 

దివ్యసన్నిధి చేరి, ధ్యానించే,

అర్చనలు,అభిషేకాలు 

పూజలు చేసి హారతి పట్టే, 

చేతులెత్తి మ్రొక్కి,మొరపెట్టుకునే, 

ఆశతో అర్థించే, కన్నీటితో ప్రార్థించే,

 

అవసరమైతే బలులర్పించే, 

నిప్పులపై నడిచే,పొర్లుదండాలు పెట్టే, 

మొక్కులు మ్రొక్కే, తలనీలాలిచ్చే,

కోటి కోరికలు కోరే,ఓ నిష్టాగరిష్టులారా!

గుళ్ళల్లో, దేవాలయాలలో

యజ్ఞాలు,యాగాలు

హోమాలు చెయ్యరేమి?

శాంతి మంత్రాలు జపించరేమి?

ఆ కరోనా రక్కసిని శపించరేమి?

 

ఓ భక్తాగ్రేసరులారా!

చర్చీలకు, మసీదులకు

మూసిన తలుపులు,

వేసిన తాళాలు తియ్యరేమి?

ప్రభువుకు ప్రార్థనలు చెయ్యరేమి?

అల్లానడగరేమి? ఆరాధించరేమి?

కాటువేసే ఈ కరోనాపై వేటు వెయ్యరేమి?

 

లాక్ డౌన్ పుణ్యమాని

అఖండ,శక్తిస్వరూపులైన 

దుష్టశిక్షణ,శిష్టరక్షణే

తమ అవతార లక్షణమనే

ఈ దేవుళ్ళు, ఈ దేవతలు

గర్భగుడుల్లో, గాడాంధకారంలో

ఎంతకాలం ఇలా మౌనంగా

కూర్చొని వుంటారు?

ఎంతకాలం ఇలా భక్తులకోసం  

నిరీక్షిస్తూ వుంటారు?

 

ఓ దేవతలారా! ఓ దేవుల్లారా !!

ఎక్కడ? మీరెక్కడ? ఏమైపోయారు మీరు ?

ఈ మాయదారి మహమ్మారి కరోనా సోకి

కోట్లు ఆర్జించిన కోటీశ్వరులు సైతం 

దిక్కులేని కుక్కచావు ఛస్తుంటే

అనాధ శవాలై స్మశానాల్లో 

గుట్టలు గుట్టలుగా పడివుంటే,

గుండెలు పగిలేలా రోదిస్తుంటే

మీ భక్తుల రోదనలు మీకు వినిపించడంలేదా?

 

ప్రళయకాళ రక్కసిలా 

ప్రపంచమంతా విస్తరించి

కరోనా చేసే ఈ వికృత విలయతాండవం 

మీ కళ్ళకు కనిపించడంలేదా?

ఈ కరోనా మ్రోగింంచే ఈ కౄర మరణమృదంగం

మీ చెవులకు వినిపించడంలేదా?

 

ఓ దేవతలారా! ఓ దేవుల్లారా !!

ఎక్కడ? మీరెక్కడ? ఏమైపోయారు మీరు ?

మీ చేతుల్లోఎన్నో ఆయుధాలున్నాయి

మీకెన్నో అద్భుత శక్తులు వున్నాయి ,మరి

ఈ కనిపించని కరోనాను ఖతం చేయలేరా?

ఈ కరోనా రక్కసిని కాల్చి బూడిద చెయ్యలేరా?

మంత్రించి ఈ కరోనాను మాయం చెయ్యలేరా?

కరోనా సోకి కళ్ళుమూసే మీ భక్తులను రక్షించుకోలేరా?

ఓ దేవతలారా! ఓ దేవుల్లారా !!

ఎక్కడ? మీరెక్కడ? ఏమైపోయారు మీరు