Facebook Twitter
మనమాటలు... నీటిమూటలైతే…

మిత్రులారా !
మన మాటలు 
నీటిలో దాచిపెట్టిన
ఉప్పుమూటలు కారాదు
ఇసుకలో వ్రాసిన పిచ్చివ్రాతలు కారాదు
ఎంత బరువైన ఉప్పుమూటైనా
నీళ్ళలో వుంచగానే కరిగిపోవడం ఖాయం
ఇసుకలో వ్రాసిన అక్షరాలు ఎంత అందమైనవైనా
అలలువస్తే అక్షరాలు చెల్లాచెదురై పోతాయి
మెలుకువ వస్తే కమ్మనికల కరిగి పోయినట్లు

మిత్రులారా !
మన మాటలు
రాతి మీద చెక్కిన
అందమైన అక్షరాలు కావాలి
ఆ అక్షరాలు ఆరాయి ముక్కలైనా
మరో ముక్కమీద మిగిలివుంటాయి
ఆ రాయిని పిండిపిండి చేస్తే తప్ప
అక్షరాలు చెక్కుచెదరవు

ఆ రాళ్ళకు చావులేదు
కారణం రాళ్ళకు జీవమేలేదు
జీవముంటేనే కదా మరణముండేది
శిధిలమైన శిలలపై చెక్కిన
దేవతా శిల్పాలెన్నో,గుళ్ళల్లో
వేలయేళ్ళుగా పూజలందుకుంటూ
గర్భగుడుల్లో దర్జాగా దర్శనమిస్తున్నాయిగా