బాబా అంబేద్కరా..!
భారత్ కే భాస్కరా..!
మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో..!
మీరే రాకుంటే మా బ్రతుకులెట్లుఉండెనో..! మీరే ఆ రాజ్యాంగం రాయకుంటే..!
ఈ భరత భూమిలో మేము బుగ్గైపోతుంటిమో..!
మసిబొగ్గై పోతుంటిమో..!
బాబా అంబేద్కరా..!
బడుగులకే భాస్కరా..!
మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అంటూ...ఏదో భూకంపం పుట్టినట్లు...
ఎక్కిన ప్రతి సభావేదిక
దద్దరిల్లేటట్లు...గొంతెత్తి
కంచుకంఠంతో మీరు పాడుతువుంటే...
ఎదురుగా మొద్దు నిద్రలో ఉన్న
అణచబడిన...అణగారిన
అమాయకపు జనంలో చైతన్య
జ్వాలల్ని మీరు రగిలిస్తుంటే...
బోధించు...సమీకరించు...పోరాడు...
సింహాలనెవ్వరూ బలివ్వరు...
మేకలను తప్ప...
పోరాడితే పోయేదేముంది..?
మీ బానిసత్వపు సంకెళ్ళు తప్ప...
రాజ్యాధికారం కోసమై మీరంతా
రక్తతర్పణకైనా సిద్దం కావాలి...అన్న
అంబేద్కర్ ఆశయాలకు జీవంపోసి..
అంబేద్కర్ సిద్ధాంతాలను
బడుగు బలహీన వర్గాలకు
పాటల రూపంలో వినిపిస్తూ...
కోట్లాదిమందిని చైతన్యవంతుల్ని చేస్తూ...
ఎవరెస్టు శిఖరమంత
ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే
ఓ సాయిచందు...ఓ సాహస వీరుడా !
నీ "అకాలమరణవార్త "
కోట్లాది మంది వీరాభిమానుల
గుండెల్లో పేలిన ఒక "అణుబాంబు"..!
ఓ గాన గంధర్వా !
ఓ అమర గాయకుడా !
చీకటిలో వెలిగే ఓ చిరుదీపమా..!
జలజల దూకే ఓ జలపాతమా..!
గలగల పారే ఓ గంగా ప్రవాహమా..!
భగభగ మండే ఓ అగ్నిపర్వతమా..!
అణగారిన ప్రజల ఓ ఆశాకిరణమా..!
ఓ విప్లవ వీరుడా !
ఓ ఉద్యమ సూర్యుడా !
నీవు మళ్ళీ మళ్ళీ పుట్టాలి...
నీవు దివినుండి భువికి దిగి రావాలి...
"నిప్పులు చెరిగే నీ పాట" మాకు కావాలి.



