తరతరాలుగా...
అంటరానితనానికి...
అగ్రవర్ణాల ఆధిపత్యానికి...
అహంకారానికి అంధవిశ్వాసాలకు...
బలైపోయిన ఓ బహుజనులారా !
ఇకనైనా నిద్ర మేల్కొని
నిజాలు తెలుసుకోవాలి నిప్పైరగలాలి !
మీలో ఆవేశం తగ్గి ఆలోచన పెరగాలి !
మీలో అఖండమైన ఓ శక్తినిక్షిప్తమై ఉందన్న
ఓ పచ్చినిజాన్ని మీరు తెలుసుకోవాలి !
మీరు వేరువేరుగా ఉంటే
వేరులేని చెట్టులా కుప్పకూలిపోతారు !
ఎన్నేళ్ళు గడిచినా తిరిగి చిగురించలేరు !
మీరొకరికొకరు
అండగా ఉంటే
మండే సూర్యులౌతారు !
మనువాదుల్ని మసి చేస్తారు !
కళ్ళుతెరిచి ఒక్కసారి చూడండి !
కలిసివున్న మిమ్మల్ని విభజించాలనే
తెరవెనుక కుట్రల్ని తెలుసుకోండి !
ఒకరినొకరు ప్రేమించుకోండి ద్వేషించుకోకండి !
దూషించుకోవడం మానుకోండి !
గౌరవించుకోవడం నేర్చుకోండి !
శూలాలవంటి సూటిపోటిమాటలతో
గాయపరుచుకోవడం మానుకోండి !
సహాయం చేసుకోండి ! సహకరించుకోండి !
తప్పుచేసినా ముందు ఒప్పుకోండి !
ఒకరినొకరు క్షమించుకోండి ! మీరంతా
ఏకమైతే మీరె రాజ్యాలనేలే రాజులౌతారు !
అమరజీవి అంబేడ్కర్ ఆఖరి ఆశయమదే
అది సాధించాలంటే వారి కల నెరవేరాలంటే
ఆ మహనీయుని తీరని కోరిక తీరాలంటే
మీలో విజ్ఞానం పెరగాలి ! విప్లవం రావాలి !
ఐక్యత సఖ్యతే మీ ఆయుధం కావాలి
మీరు విజయశంఖారావం పూరించాలి !
ఔనిది నిజం ప్రశ్నిస్తేనే...
పులులై పోరాడితేనే...
సమిష్టిగా ప్రతిఘటిస్తేనే...
పోయిన హక్కులు పొందేది...
జీవితాలను త్యాగం చేస్తేనే...
రక్తాన్ని చిందిస్తేనే...రాజ్యాధికారం దక్కేది...



