కోట్లమంది జీవితాలలోని
చిమ్మచీకట్లను తొలగించి
వెన్నెలవెలుగులను పంచి
కొండంత జీవితాన్ని...కొవ్వొత్తిలా
కరిగించి, కొందరికోసం కాదు
కోట్లాది భారతీయుల సంక్షేమాన్ని ఆకాంక్షించి
అమరజీవి అంబేద్కర్అందించిన
"అమృతభాండం" మన "భారత రాజ్యాంగం"
తన రక్తాన్ని ,చెమటచుక్కల్ని
సిరాచుక్కలుగా మార్చి
తన ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి
కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి
అతిక్లిష్టమైన విదేశాల రాజ్యాంగాలన్నీ
రాత్రింబవళ్ళు అధ్యయనం చేసి...చేసి
అమరజీవి అంబేద్కర్ అందించిన విలువైన... విశిష్టమైన...వినూత్నమైన
ప్రపంచమేధావులచే ప్రశంసింపబడిన
ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో
కన్న మిన్నైన "మణిమకుటం"
మన "భారత రాజ్యాంగం"
రాబోవు వెయ్యితరాలకు
చక్కని సుపరిపాలన సూత్రాలను
సురక్షితమైన జీవనానికి మహత్తరమైన
మంగళకర మార్గాలను సూచించి,అందులో
దేవతలకే తప్ప దెయ్యాలకు ప్రవేశంలేదని
గొప్పఆశయంతో అమరజీవి అంబేద్కర్ నిర్మించిన
"సువర్ణశోభిత దేవాలయం" మన "భారతరాజ్యాంగం"
సమైక్యతకు సమగ్రతకు నాదేశం "సోపానమన్న"
భిన్నత్వంలో ఏకత్వమే మన "నినాదమన్న"
సర్వమతాలకు, కులాలకు,జాతులకు,సంస్కృతి
సంప్రదాయాలకు నాభరతజాతి "నిలయమన్న"
ప్రజాస్వామ్యమే దానికి "ఆరవప్రాణమన్న"
అదే నా భరతమాతకు "స్వర్ణాభరణమన్న"
ఈ భారతరాజ్యాంగమే మనకు "రక్షణకవచమన్న"
అంబేద్కర్ అమృతవాక్కుల్ని కలనైనా మరువరాదు...
రాజ్యాంగ నిర్మాతైన అందరివాడైన అంబేద్కర్
మహనీయుని "స్మరణే" ప్రతిభారతీయునికి "ఓ ప్రేరణ"...



