అందముందని ఆస్తి వుందని
అధికారముందని అహంకారంతో
విర్రవీగే ఓ వెర్రివాళ్ళారా !
ఎగిసిపడే ఓ ఎండుటాకుల్లారా !
మురిసిపోయే ఓ మూర్ఖుల్లారా !
రెచ్చిపోయే ఓ పిచ్చివాళ్ళారా !
అదంతా మూన్నాళ్ళ ముచ్చటేరా!
మొన్న అమ్మైనా
అమ్మను కాదు బాపుబొమ్మనని
తన అందమే తనకి తరగనిఆస్తి అని
అందాలు ఆరబోస్తూ
ఒయ్యారాలు ఒలకబోస్తూ
వలపు వలలు విసురుతూ
యువతను రెచ్చగొట్టి
చచ్చేంతగా పిచ్చివాళ్ళను చేసి
ఆటబొమ్మలుగా ఆడించి
అహంకారంతో విర్రవీగిన
అందమైన సుందరాంగులెందరో
అందం...అశాశ్వతమన్న
నిప్పులాంటి నిజాన్ని తెలుసుకున్నారు
అవసాన దశలో.....
తమ అందాన్నిచూసి తామె
ఆశ్చర్యపోయారు...అసహ్యించుకున్నారు
అటు ఏడు ఇటు ఏడు తరాలు తిన్నా
తరగనంత కరగనంత
ఎవ్వరూ లెక్కపెట్టలేనంత ఆస్తి వుందని
అహంకారంతో విర్రవీగే కోటీశ్వరులెందరో
ఆస్తులెన్నున్నా పస్తులుండక
తప్పదన్న పచ్చినిజం తెలుసుకున్నారు
అవసానదశలో......
వ్యాధులు ముదిరి...వ్యధ చెందారు
నోట్లుకోట్లున్నా
కూడు కరువైనందుకు...కుమిలిపోయారు
అదిగో అధికారముందని
అడ్డదారుల్లో గాడిదలల్లే గడ్డి మేస్తూ
దోపిడీ దొంగలల్లే దొరికినంత దోచుకుని
విదేశీ బ్యాంకుల్లో దాచుకుని
దొరలల్లే దర్జాగా తిరుగుతూ
అహంకారంతో విర్రవీగే
అవినీతి అధికారులెందరో
సిబిఐ వలలో చిక్కి కోర్టులకెక్కి
నలుగురిలో నవ్వులపాలై
అధికారం...అశాశ్వతమన్న
అక్రమంగా ఆర్జించడం...పాపమన్న
అధికార దుర్వినియోగం...మహాశాపమన్న
ఓ నిండునిజాన్ని తెలుసుకున్నారు
అవసానదశలో......జైలుపాలై
హీరోలు జీరోలై...గతిలేక జైల్లో గంజినీళ్ళు గతికారు
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
కలనైనా మరవకండి ముందున్నదొక అవసానదశ
అది అగ్నిగుండమైతే ఎంతోదుఃఖం ఎంతోదురదృష్టం
అది అమృతభాండమైతే ఎంతటిభాగ్యం ఎంతటిఅదృష్టం



