ఆమె ఒక తల్లి
కనడానికైతే తాను కన్నది కాని
కనేంతవరకు ఆ కడుపులో ఉన్నది
ఆడా? మాగా ?"అర్ధంకాక" అల్లాడిపోయింది
ఆ తర్వాత
బిడ్డను కనడానికి...
తాను తల్లి కావడానికి..
తన్మయత్వం చెందడానికి..
మాతృత్వపు మాధుర్యాన్ని
రుచి చూడడానికి కారణం
భర్తా ? లేక భగవంతుడా ?
"అర్ధంకాక" మళ్ళీ కుమిలిపోయింది
ఆపై పుట్టిన బిడ్డ
"అమ్మాఆకలంటూ కేకలు పెడుతుంటే
"ఆ పసికందు" ఆకలి తీర్చేదెలా ? అని
మదనపడుతుంటే...కలవరపడుతుంటే
తన "ఎఱ్ఱనిరక్తాన్ని" తెల్లనిపాలగా మార్చి
కన్నబిడ్డ "కడుపునింపే శక్తిని"
తనకిచ్చింది ప్రకృతా ? పరమాత్మా?
"అర్ధంకాక" మరోసారి మౌనంగా రోదించింది
కాని అన్నింటికీ కారణం
కనిపించక పోయినా కరుణించే
అఖండశక్తి స్వరూపుడైన ఆ దైవమేనని
"ఆ తల్లికి అర్థమైంది" అందుకే
ఆ పరమాత్మ పాదాలచెంతకు చేరి
ఆ కన్నతల్లి"కన్నీటితో ప్రార్ధన"చేసిందిలా
ఓ తండ్రీ ! ఆ పసికందుకు జన్మనిచ్చిన అమ్మను నేనే
కాని, నాగర్భంలోని పిండానికి ప్రాణంపోసిన దైవంమీరే



